ఎప్పుడు కట్టారన్నది కాదు..రిబ్బన్ తెగిందా లేదా!
ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు. కేంద్రంమీద కేసీఆర్ కత్తిదూస్తున్న టైంలో ఆయన టూర్ పెట్టుకున్నారు. ఫాంహౌస్ కేసులో బీజేపీని అడ్డంగా బుక్‌చేసే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నారు. గులాబీ, కాషాయపార్టీల మధ్య యుద్ధవాతావరణం ఉన్న సమయంలో ప్రధాని తెలంగాణకు వస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితమివ్వబోతున్నారు. మామూలుగా అయితే ఓ ప్రతిష్టాత్మకఫ్యాక్టరీ ఓపెనింగ్ ప్రోగ్రాంకి రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ఏర్పాట్లు చూసుకోవాలి. ప్రధానికి స్వాగతసత్కారాలు ఏర్పాటుచేసి కార్యక్రమంలో వేదికపై హడావుడిచేయాలి. కానీ ఇప్పుడు మొహాలు చూసుకునే పరిస్థితి కూడా లేదు. తనకెంతో దగ్గరైన త్రిదండి చినజీయర్‌స్వామి నిర్మించిన ముచ్చింతల శ్రీరామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమానికే కేసీఆర్ మొహం చాటేశారు. ప్రధాని అంతా తానైన ఆ కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం ఓ రకంగా బహిష్కరించారు. తర్వాత మళ్లీ ప్రధాని రామగుండం వస్తున్నారు. పిలవలేదనే లోటుకూడా అధికారిక ఆహ్వానంతో తీరింది. అయినా కేసీఆర్ మరోసారి మోడీ టూర్వైపు చూడటం లేదు.
కేసీఆర్ వెళ్లడం, వెళ్లకపోవడం వేరే విషయం. అసలా ప్రారంభోత్సవమే వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు తలంబ్రాలు ఏంటని టీఆర్ఎస్ ఎత్తిపొడుస్తోంది. దశాబ్దాలుగా ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ఇప్పుడు ప్రధాని రిబ్బన్‌కట్ చేయడాన్ని తప్పుపడుతోంది. అయితే ఎప్పుడో కట్టిన ఫ్యాక్టరీ ఇప్పటిదాకా ఎందుకు మూసి ఉందని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేంద్రం చొరవతోనే రామగుండ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ జరిగిందని అందుకే జాతికి అంకితమివ్వడంలో తప్పేమీ లేదని వాదిస్తోంది. కానీ నాటోన్లీ రామగుండం ఫ్యాక్టరీ. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇదే జరుగుతోందన్నది టీఆర్ఎస్ శ్రేణుల వాదన.
చంద్రబాబు కొబ్బరికాయ కొట్టిన ఔటర్ రింగ్‌రోడ్డుని వైఎస్ హయాంలో ప్రారంభించలేదా. అధికారంలో ఉన్నవాళ్లకు ఉన్న అడ్వాంటేజ్ అదే. మోడీ అయినా, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అయినా అలాంటి అవకాశాల్ని అస్సలు వదులుకోవడంలేదు. బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్ అంబేద్కర్ ఎకనమిక్స్ స్కూల్ భవనాన్ని మాజీ ప్రధాని మన్నమోహన్సింగ్ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి పచ్చజెండా ఊపడం కూడా ఈ కోవలోనిదే. కోల్‌కతాలో చిత్తరంజన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెండో క్యాంపస్‌ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అయితే మమతాబెనర్జీ దాన్ని అంతకుముందే ఓపెన్ చేశారు. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రోగ్రాం కూడా అట్టాంటిదే. సో వాట్!