టీ బీజేపీనీ గట్టిగా పట్టుకున్న “కాంగ్రెస్ వైరస్” !

By KTV Telugu On 13 April, 2022
image

కాంగ్రెస్‌లోఅంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఈ పేరుతో ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటూ ఉంటారు . ఇప్పుడు తెలంగాణ బీజేపీలోనూ అవే కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కువే కనిపిస్తున్నాయి. సీనియర్ నేతలు ఒకరంటే ఒకరికి పడదు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి .. కేంద్ర నేతలకు ఆగ్రహం తెప్పించకుండా అంతర్గత రాజకీయాలు చేసుకుంటున్నారు. ఒక్కో నేత ఒక్కో గాడ్ ఫాదర్‌ను వెదుక్కుని తెలంగాణలో తామే బీజేపీ తరపున కీలకం అన్నట్లుగా ఫీలవుతున్నారు. ఫలితంగా కొంత మంది తమ వర్గాల గొడవల్ని బయటకు తీసుకు రాకుండా ఉండలేకపోతున్నారు.

సొంత పార్టీ నేతల టిక్కెట్ చింపేస్తామన్న బండి సంజయ్ !

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఓ సమావేశంలో పార్టీ నేతలపై మండిపడ్డారు. ఆయన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలు వేరు . కానీ సొంత పార్టీ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సహజంగానే కలకలం రేపుతాయి. ఇటీవల ఆ పార్టీలోని ఓ వర్గం నేతలు అరవై వరకూ అసెంబ్లీ స్థానాల్లో టిక్కెట్లను ఆరు నెలల ముందుగానే ప్రకటిస్తుందని చెప్పడం ప్రారంభించారు. వెంటనే ఇలా టిక్కెట్ల గురించి ప్రచారం చేసే వాళ్లకి టిక్కెట్లు ఇవ్వరని బండి సంజయ్ నేరుగా పార్టీ సమావేశాల్లోనే హెచ్చరించడం ప్రారంభించారు. తన టిక్కెట్‌కే గ్యారంటీ లేదని ఇక ఇతరులకు టిక్కెట్లు ఎలా వస్తాయని ఆయన చెబుతున్నారు. బండి సంజయ్ అసంతృప్తి ఈటల రాజేందర్ పైనేనని చెబుతున్నారు. ఇటీవల బీజేపీలో ఈటల రాజేందర్ తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా కొంత మంది నేతల్ని ప్రోత్సహిస్తూ వారికే టిక్కెట్ వస్తుందని చెప్పడం ప్రారంభించారు. అంతే కాక ఆరు నెలల ముందుగానే టిక్కెట్ల ప్రకటన ఉందని చెబుతున్నారు. ఇది బండి సంజయ్‌కు నచ్చలేదని తెలుస్తోంది.

బండి సంజయ్‌పై రఘునందన్ ఆగ్రహం !

బండి సంజయ్‌పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ తనను పట్టించుకోవడం లేదని ఫీలవుతున్నారు. పాదయాత్ర రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ తనను ఆహ్వానించలేదని పిలవకుండా వెళ్లి అవమానపడదల్చుకోలేదని ఆయన అంటున్నారు. మొదటి విడత పాదయాత్ర మెదక్ జిల్లాలో సాగిన తనకు సమాచారం ఇవ్వలేదని రఘునందన్ అంటున్నారు. బీజేపీలో రఘునందన్ తీరు ఇటీవలి కాలంలో రెబల్‌గా కనిపిస్తోంది. ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు అయినా .. ఆయన బీజేపీఎల్పీ భేటీకి హాజరు కావడం లేదు. రాజాసింగ్ ప్లేస్‌లో తనకు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరి ఫ్లోర్ లీడర్, మరొకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్..మరొకరికి విప్ పదవి ఇవ్వాలంటున్నారు. కానీ బండి సంజయ్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పార్టీలో బండి సంజయ్ సొంత పెత్తనం చేస్తున్నారన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో రెండు, మూడు వర్గాలు !

తెలంగాణ బీజేపీలో రెండు, మూడు వర్గాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాలు ఉన్నాయి. వీరు ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో రూమర్స్ ప్రచారం చేసుకుంటున్నాయి. రఘునందన్‌పై ఇటీవల బీజేపీలోని ఓ వర్గం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆయన బీజేపీలో ఉండరని వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌లో చేరిపోతారని.. మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే రఘునందన్ మాత్రం తాను బీజేపీని వదిలి పెట్టే ప్రశ్నే లేదంటున్నారు. మరో వైపు బండి సంజయ్ కూడా తన వర్గాన్ని విస్తృతంగా పెంచుకుంటున్నారు. కిషన్ రెడ్డిజాతీయ రాజకీయాల్లో ఉండటంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోలేకపోతున్నారు. కానీ స్థానికంగా .. బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ బండి సంజయ్.. కొంత మందిని ఖరారు చేసి నియోజకవర్గాలకు పంపుతున్నారు. . ఈ పరిణామాలతో బీజేపీలోని ఇతర సీనియర్ నేతలు కూడా తామేం తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో అంతర్గత రాజకీయం ముదిరిపాకాన పడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇది కట్టు దాటితే కాంగ్రెస్ కన్నా దారుణంగా పరిస్థితి మారిపోతుందని ఆ పార్టీ క్యాడర్ ఫీలవుతున్నారు.