టీఆర్ఎస్‌కు షాకింగ్ న్యూస్

By KTV Telugu On 10 November, 2022
image

తుమ్మల అడుగులు ఎటువైపు?
పార్టీ మారతారని జోరుగా ప్రచారం
ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ నిఘా

మునుగోడు విజయంతో మంచి జోష్ మీదుంది టీఆర్ఎస్. నల్గొండను క్లీన్ స్వీప్ చేశామన్న ఆనందంతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే, ఆపక్కనే ఉన్న మరో జిల్లా ఆందోళనకు గురిచేస్తోంది. పక్కనే ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఖమ్మంలో మాత్రం పట్టుసాధించలేకపోతోంది. గ్రూపు రాజకీయాల కారణంగా జిల్లాలో కారు స్పీడుకు బ్రేకులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్న టీఆర్ఎస్ కు ఆ జిల్లాలోని బలమైన నేతలు మింగుపడని అంశంగా మారారు. పక్క పార్టీల వైపు చూస్తుండడంతో గులాబీ దళం హైరానా పడుతోంది. ఇప్పటికే పొంగులేటి కాషాయదళంతో టచ్ లోకి వెళ్లిపోయారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు మరో కీలక నేత ఝలక్ ఇవ్వనున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన గండుగులపల్లి నుంచి భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల మీదుగా ములుగు జిల్లా వాజేడుకి సుమారు 300 వాహనాలతో ర్యాలీ తీయడం సంచలనంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు వాజేడుకు తరలివెళ్లడం రాజకీయంగా హీట్ పెంచుతోంది. ఈ సమావేశం టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధం లేకుండానే జరుగుతోందని తుమ్మల సన్నిహితులు చెబుతున్నారు. దీంతో రాజకీయంగా తుమ్మల ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా తుమ్మల పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా అనుచరులతో రహస్య సమావేశం నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజన్స్ వర్గాలు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశంతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, క్యాబినెట్లో మంత్రిగా సేవలందించారు. 2014 ఎన్నికల్లో గులాబీ తీర్థం పుచ్చుకున్న తుమ్మల ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2016లో జరిగిన ఉపఎన్నికలో పాలేరు నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తనపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. తనను అధిష్టానం పట్టించుకోవడం లేదని అసంతృప్తితో తుమ్మల ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని కందాల ప్రకటించుకుంటున్నారు. దీంతో తుమ్మల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయటం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.