ఏపీలో విగ్రహాలపై నీచ రాజకీయాలు

By KTV Telugu On 11 November, 2022
image

కాదేది కవితకు అనర్హం అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రతి చిన్న విషయం కూడా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం ఒకవైపు టీడీపీ, జనసేన, ఒక వర్గం మీడియా మరోవైపు ఉండి ఒకరిపై ఒకరు అప్రాధాన్య అంశాలపై ఒకరినొకరు నిందించుకుంటున్నారు. తాజాగా యోగీ వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్‌ఆర విగ్రహం పెట్టారని మీడియాలో వార్తలొచ్చాయి. వెంటనే టీడీపీ శ్రేణులు ఈ వార్తను బాగా ప్రచారం చేశాయి. దాంతో సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలొచ్చాయి. నిజం గడప దాటేలోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుంది అన్నట్లు వాస్తవం ఏంటో తెలిసేలోగా వేమన విగ్రహం తొలగించారనే అబద్దం అందరికీ చేరిపోయింది. అసలు అక్కడేం జరిగిందంటే.

ఈమధ్య యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని సుందరంగీ తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వేమన సర్కిల్లో ఉన్న వేమన విగ్రహాన్ని కొత్తగా కట్టిన ప్రధాన ద్వారం వద్దకు మార్చారు. ఖాళీ అయిన చోట యూనివర్సిటీలోనే ఒక మూలన ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంతేకానీ వేమన విగ్రహాన్ని తొలగింగి వైఎస్‌ఆర్‌ విగ్రహం పెట్టడం అనేది వాస్తవం కాదని అని వివరణ ఇచ్చారు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య మునగల సూర్యకళావతి చెప్పారు. ఈ యూనివర్సిటీని వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 2006లో నెలకొల్పారు. అందుకే వైఎస్‌ఆర్‌ జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని కూడా పెట్టారు. కేవలం రాజకీయ లబ్ది కోసం యూనివర్సిటీ మీద తప్పుడు వార్తలు రాయడం తగదని ఆమె అన్నారు. విశ్వవిద్యాలయంలో ఎక్కడా కొత్త విగ్రహాలు పెట్టడం కానీ ఉన్న విగ్రహాలను తొలగించడం కానీ చేయలేదన్నారు. ఇంకో గమ్మత్తు ఏంటంటే వేమన విగ్రహం తొలగించారని తెలియగానే పవన్‌ కళ్యాణ్‌ వేగంగా రియాక్టయ్యారు. ఒక వేమన పద్యం పోస్టు చేసి తన స్పందన తెలియజేశారు. ఆ తరువాత అది తప్పుడు వార్త అని తెలియగానే గప్‌చుప్‌ అయిపోయారు. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా తుగుదునమ్మ అంటూ మధ్యలో తలదూర్చిన పవన్‌ కళ్యాణ్‌పై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.