మనం చైనాని దాటేస్తున్నాం.. ఎందులోనంటే
ఆ విషయంలో మన దెబ్బకి చైనా కూడా ఔటే!
దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. పేదరికం పెరుగుతోంది. కుబేరుల సంపద పెరుగుతోంది. దాంతో పాటు మరో విషయంలోనూ మనల్ని కొట్టేవారు లేరన్నట్లు రికార్డు సృష్టించబోతున్నాం. జనాభాలో కొమ్ములు తిరిగిన డ్రాగన్‌ని కూడా వెనక్కి నెట్టేయబోతున్నాం. 2022 నవంబరులో ప్రపంచజనాభా కొత్త రికార్డు నమోదుచేస్తోంది. నవంబరు 15 నాటికి ప్రపంచజనాభా 800 కోట్లకు పెరుగుతుంది. 1950 జనాభాతో పోలిస్తే ఇది మూడురెట్లు ఎక్కువ. అదే సమయంలో 2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదైంది. 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. 2030నాటికి ప్రపంచజనాభా అలవోకగా 850 కోట్లు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనావేస్తోంది.
2050 నాటికి 970 కోట్లుగా ఉండే ప్రపంచజనాభా 2080 నాటికి వెయ్యి కోట్లను దాటుతుందంటున్నారు. ప్రపంచ జనాభా వృద్ధిలో 50 శాతం కంట్రిబ్యూషన్ కేవలం ఎనిమిది దేశాల్లోనే సంభవిస్తోంది. అందులో మనం కూడా ఉన్నామని జబ్బలు చరుచుకోవచ్చు. భారత్‌తో పాటు ఇథియోపియా, నైజీరియా, కాంగో, టాంజానియా, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ దేశాల్లో జనాభా వృద్ధి రేటు అధికంగా నమోదవుతోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా రికార్డు కాపాడుకుంటూ వస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీకున్న ఆ ఘనతని త్వరలోనే మనం సొంతం చేసుకోబోతున్నాం. 2023లో జనాభా విషయంలో భారత్ చైనాని అధిగమిస్తుంది. భారత్‌లోని పట్టణప్రాంతాల్లో జనాభా అసాధారణంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. సో.. చైనా మిగిలిన విషయాల్లో ఎంత ముందున్నా జనాభా విషయంలో వెనకడుగు వేయక తప్పదన్నమాట!