పవన్‌ను మోడీ లైట్ తీసుకున్నారా?

By KTV Telugu On 12 November, 2022
image

టీడీపీతో పొత్తుపై ఊగిసలాట
నిరాశతో వెనుదిరిగిన జనసేనాని
బీజేపీ నేతలకు మోడీ రూట్ మ్యాప్

అనుకున్నదొక్కటీ, అయ్యిందొక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లుగా ఉంది పవన్ కల్యాణ్ పరిస్థితి. ప్రధాని సాగరతీరానికి వచ్చిన వేళ ఆగమేఘాల మీద ప్రత్యేకవిమానంలో పరిగెత్తుకొచ్చిన పవన్ కల్యాణ్ నిరాశతో వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. అరంగట భేటీలో ఏంచర్చించారో గానీ ఆశించిన మేర ఫలితం రాలేదనేది మాత్రం స్పష్టంగా కనిపించింది. రోడ్ మ్యాప్ ఇవ్వని బీజేపీతో కలిసి వెళ్లలేనంటూ ఆ పార్టీకి ఊడిగం చేయలేనంటూ చంద్రబాబు దగ్గరకు చేరారు పవన్. అయితే బీజేపీతో బంధంపై ఊగిసలాట కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల పొత్తు క్లియర్ కట్ గా కనిపిస్తున్న వేళ మధ్యలో బీజేపీ కూడా చేరుతుందా అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో విశాఖలో మోడీ, పపన్ ల భేటీతో ఏదో జరగబోతుందనే విశ్లేషణలు సాగాయి. మోడీ పర్యటన షెడ్యూల్ లో పవన్‌ లేనప్పటికీ రెండు పార్టీల మధ్య రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొదట 10 నిమిషాలే అనుకున్నప్పటికీ మోడీ, పవన్ లు 30 నిమిషాలు సమావేశమయ్యారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కల్యాణ్ ప్రభుత్వ తీరుపై తాను చెప్పదల్చుకుందంతా చెప్పేందుకే మోడీతో భేటీని ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. అటు ప్రధాని కూడా అంతా సావధానంగా విని అన్నీ తనకు తెలుసునంటూ ఒక్కమాటతో పవన్‌ను కట్టిపడేసినట్లు సమాచారం.

మోడీ, పవన్ భేటీలో టీడీపీ పొత్తు అంశం చర్చకు వచ్చిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ సానుకూలంగా కనిపించడం లేదు. ఇదే మాటను రాష్ట్రస్థాయి నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు పవన్ మాత్రం ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు విపక్షాలన్నీ కలిసి రావాలని కోరుతున్నారు. ఇదే ప్రతిపాదనను బీజేపీ నేతల వద్ద పెట్టారు జనసేనాని. అయితే పవన్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే టీడీపీతో జతకడతామనే మెలిక పెడుతున్నారట కమలనాథులు. అటు చంద్రబాబు కూడా చివరి నిమిషం దాకా వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ విషయంలోనే బాబు బీజేపీ అగ్రనేతల ఆగ్రహానికి గురయ్యారు. అందుకే 2019 ఎన్నికల తర్వాత బాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసినప్పటికీ మోడీ-షాలు మాత్రం దూరంపెడుతూ వచ్చారనే టాక్ ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీతో కన్నా టీడీపీతో కలిసి వెళ్తేనే లాభమని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో జనసేనానిని సైతం బీజేపీ లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పవన్‌ను హడావుడిగా రప్పించిన బీజేపీ నేతలు ప్రధానితో భేటీలో ఏమీ తేల్చకుండానే వెనక్కి పంపించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో మొదటి నుంచి సఖ్యతగా ఉంటూ వస్తోంది. ఎక్కడా విభేదాలకు పోవడం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా కేంద్రానికి అవసరమైనప్పుడల్లా జగన్ మోడీకి మద్దతుగా నిలుస్తున్నారు. అటు మోడీ సర్కార్ కూడా జగన్‌తో స్నేహపూర్వకంగానే మెలుగుతోంది. దీంతో ఇరుపార్టీల మధ్య మంచి వాతావరణమే ఉంది. ఈ అంశంలోనే జనసేనాని బీజేపీపై అసంతృప్తి వెళ్లబుచ్చుతున్నారు. అయితే పవన్‌ను నమ్ముకొని వైసీపీని బీజేపీ దూరం పెట్టే పరిస్థితి లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీతో వెళ్లే క్రమంలో పవన్ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆగ్రహంతో కమలనాథులు కనిపిస్తున్నారు. పవన్‌తో భేటీలో పెద్దగా చర్చకు వచ్చిన అంశాలేవీ లేవని తెలుస్తోంది. అయితే ఏపీ కోర్ కమిటీతో మాత్రం` ప్రధాని కీలక అంశాలు చర్చించారు. జగన్ సర్కార్‌కు మద్దతుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ స్పూర్తితో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు వేరు, అదే సమయంలో రాజకీయం వేరని ప్రధాని తేల్చి చెప్పారట. ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూనే ప్రభుత్వ తప్పులను ప్రజల్లో నిలదీయాలని మోడీ నిర్దేశించినట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.