ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో విశాఖపట్టణం గురిచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి సానుకూలంగా మాట్లాడారు. విశాఖ దేశంలోనే విశేషమైన నగరం అని ఇక్కడి ఓడరేపు చారిత్రకమైనది అని కొనియాడారు. ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏపీ ప్రజలకు మంచి గుర్తింపు ఉంది అని ప్రశంసించారు. తన మిగతా ప్రసంగంలో కూడా అభివృద్ధి గురించే మాట్లాడు. జగన్ సర్కారు మీద వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఇతర విషయాలేమీ ఆయన ప్రస్తావించలేదు.
విశాఖ నుంచి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టేసరికి మోదీ మాట తీరు పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ సర్కారు మీద ఆయన నిప్పులు చెరిగారు. ఇటీవల సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వారి తిట్లను తాను పట్టించుకోనని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తాను తిట్లు తింటూనే ఉన్నానని రోజుకు మూడు కేజీల తిట్లు తింటానని, ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని చెప్పారు మోది. తనను తిడితేనే రైతులు బాగుపడతారంటే తిట్లు తినడానికి తాను సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమను వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు.
అవినీతి, కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువని మోదీ చెప్పారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు. పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణలో చీకటి తొలగిపోయే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ అని ఇలాంటి నగరంలో టీఆర్ఎస్ పార్టీ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీ స్పీచులో కనిపించిన మార్పు చూసినవారు జగన్ ప్రభుత్వం పట్ల మోదీ పూర్తి సానుకూలంగా ఉన్నారని అదే సమయంలో కేసీఆర్ సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించిందని విశ్లేషిస్తున్నారు.