కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని అభినందించిన ప్రధాని మోది

By KTV Telugu On 12 November, 2022
image

మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తరువాత సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులే తనకు వ్యతరేకంగా పనిచేశారని అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పెద్ద ఊరట లభించింది. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారంటూ ఏకంగా ప్రధాని మోదీ కోమటిరెడ్డిని భుజం తట్టి ప్రశంసించారు. విశాఖ పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్‌లో అడుగు పెట్టారు మోది.

బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాల్సిందేనని చెప్పారు. తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని దేశంలో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ కమలం వికసిస్తుందని అన్నారు. సభ ముగిసిన తర్వాత ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. అందరితో పాటు లైన్ లో నిల్చున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నేతలు ప్రధానికి పరిచయం చేశారు.

వెంటనే మోదీ రాజగోపాల్ రెడ్డి వద్ద ఆగి ఆయనతో ప్రత్యేకంగా రెండు నిమిషాల సేపు ముచ్చటించారు. మునుగోడు ఉపఎన్నికలో బాగా కష్టపడ్డారని అభినందించారు. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారంటూ భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. నేను చూసుకుంటా అంటూ కోమటిరెడ్డికి వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. మిగిలిన నాయకులతో మాట్లాడుతూ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ శ్రేణులు ప్రజలకు వివరించాలని మోదీ సూచించారు. అనంతరం అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్ లో రామగుండంకు బయల్దేరారు.