వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. ఏ పార్టీ టికెట్ మీద గెలిచారో అదే పార్టీని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రోజూ తిట్టిపొయ్యడమే ఆయన పని. ఆ తిట్లు శాపనార్థాల కార్యక్రమానికి రచ్చబండ అని ఒక పేరు కూడా పెట్టుకున్నారు. జగన్ మీద ఆయనకు ఎందుకంత కోపమో తెలియదు కానీ ఆయన మాత్రం ప్రతి చిన్న విషయానికి సీఎంను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తుంటారు. అయిన దానికి కానిదానికి కోర్టును ఆశ్రయించడం ఆయనకు అలవాటైపోయింది. పలుమార్లు న్యాయ వ్యవస్థ మొట్టికాయలు వేసినా ఆయన మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. తాజాగా రఘురామ విశాఖలోని రుషికొండపై అనుమతులకు మించి తవ్వకాలు జరిగాయని
సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ను సున్నితంగా మందలించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
రుషికొండలో ఏం జరుగుతున్నదో నివేదిక సమర్పించాలంటే ఇటీవల కేంద్ర పర్యావరణశాఖను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వశాఖలు అదే పనిలో ఉన్నాయి. ఈ లోగా రఘురామ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
రుషికొండలో రెండు కిలోమీటర్ల వరకు అక్రమ తవ్వకాలు జరిపారని, అందుకు సంబంధించిన ఫొటోలతో సహా రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం విశేషం. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తి చూపలేదు. ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఏంటని పిటిషినర్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు నిలదీసింది. ఏదైనా వుంటే హైకోర్టులోనే చూసుకోవాలని కోరింది. రుషికొండపై నిర్మాణాలపై పిటిషనర్ కోరుకున్నట్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల వరకూ వేచి చూడాలని హితవు చెబుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.