ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్కింగ్ స్టైల్ అందరికీ తెలుసు. సంఘ విద్రోహులు, నేరస్తుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడమనే ఒక కొత్త పద్దతిని ఆయన అమలు చేస్తుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోరు. యోగీ అవలంభిస్తున్న బుల్డోజర్ పాలసీకి మద్దతు తెలిపేవారు కూడా ఉన్నారు. అందుకే యోగిని బుల్డోజర్ బాబా అనే పేరు పెట్టారు. యూపీ తరహా బుల్డోజర్ సర్కారును తెలంగాణలో కూడా తీసుకొస్తామని ఆ మధ్య బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా యోగీ ఫార్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని సిట్ పోలీసుల విచారిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో దక్కన్ కిచన్ హోటల్‌కు సంబంధించిన రెండు నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేశారు. ఇవి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్‌వి. ఎలాంటి అనుమతులు లేకున్నా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో ఈ రెండు నిర్మాణాలు చేపట్టారని, నోటీసులు ఇచ్చినా పనులు ఆపలేదని అందుకే కూల్చివేశామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. ఇది రాజకీయ కక్షతోనే తమ హోటల్ను కూల్చేశారని నందకుమార్ భార్య ఆరోపించారు. అది అక్రమ నిర్మాణం అని తెలిసినప్పుడు జీహెచ్‌ఎంసీ అధికారులు ఇన్ని రోజులు ఎందుకు ఓపిక పట్టారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారనే కోపంతోనే నందకుమార్ హోటల్ ప్రాంగణంలోని నిర్మాణాలను కూల్చేసి ఉంటారని అనుకుంటున్నారు.