కారెక్కుతామంటోన్న కామ్రెడ్స్
వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు?
పాలేరుపై కన్నేసిన సీపీఎం
తుమ్మల జంప్ ఖాయమా?
తెలంగాణలో ఎనిమిదేళ్లుగా వామపక్షాలు టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం కామ్రెడ్స్ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో సారు కారు లిఫ్ట్ ఇవ్వడంతో లెఫ్ట్ పార్టీలు రైట్ రైట్ అంటున్నాయి. మునుగోడులో మద్దతు ఇవ్వడం ద్వారా గులాబీ పార్టీని గెలిపించిన కమ్యూనిస్టులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ నుంచి అలాంటి సంకేతాలు ఏవీ రావడం లేదు గానీ కామ్రెడ్స్ మాత్రం కారులో షికారు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరేస్తానంటున్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తమ్మినేని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అన్ని సీట్లు టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కూటమి గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. అంతేకాదు, గ్రామాల్లో టీఆర్ఎస్ , సీపీఐ, సీపీఎంల మధ్య ఏమైనా మనస్పర్థలు ఉంటే వాటిని సరిచేసుకోవాలని సూచించడం కొసమెరుపు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు ఒప్పందంతోనే మునుగోడులో వామపక్షాలు మద్దతిచ్చాయా అనే సందేహం కలుగుతోంది. తమ్మినేని వ్యాఖ్యలను బట్టి చూస్తే టీఆర్ఎస్ మద్దతుతో పాలేరులో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీకి గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో కాషాయదళాన్ని నిలువరించేందుకు కేసీఆర్ వామపక్షాలను కూడా కలుపుకోవాలని భావిస్తున్నారట. అటు కమ్యూనిస్టులు సైతం టీఆర్ఎస్‌తో పొత్తుతో రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకు మునుగోడు ఉపఎన్నికను వేదికగా మల్చుకొని సక్సెస్ అయ్యారు. మునుగోడులో అంతా ఏకమై విజయం సాధించడంతో ఆ దోస్తీని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించాలని భావిస్తున్నారు కమ్యూనిస్టులు. బీజేపీని రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు టీఆర్ఎస్‌తో కలిసి కొట్లాడుతామంటున్న తమ్మినేని పాలేరును ఎర్రజెండా ఖాతాలో వేసుకుంటామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మునుగోడు బై పోల్ టైమ్‌లోనే కేసీఆర్, వామపక్షనేతలకు మధ్య ఒప్పందం కుదిరినట్లు తమ్మినేని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలకు కొన్ని సీట్లు ఇచ్చే విధంగా చర్చలు నడిచాయని, దాంట్లో భాగంగానే పాలేరుపై సీపీఎం గురిపెట్టినట్లు తెలుస్తోంది. పాలేరు సీటు కేసీఆర్ కమ్యూనిస్టులకు కేటాయిస్తారనే సమాచారంతోనే తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఆయన భారీ ర్యాలీ తీయడం, రహస్యంగా అనుచరులతో భేటీ కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
పాలేరు, మధిర, నల్గగొండ, నకిరేకల్ , మిర్యాలగూడ సీట్లపై సీపీఎం కన్నేసింది. కొత్తగూడెం, హుస్నాబాద్ , మునుగోడు, బెల్లంపల్లి, దేవరకొండ నియోజక వర్గాలపై సీపీఐ దృష్టి పెట్టింది. ఆయా సెగ్మెంట్లలో ఎలాగైనా రెండింటిని దక్కించుకోవాలనేది కమ్యూనిస్టుల ఆలోచనగా కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనను కేసీఆర్ ముందుంచేందుకు సిద్ధమవుతున్నారట. అయితే, వామపక్షాలు కోరుతున్నట్టుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీట్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నిరాకరించే అవకాశముంది. మునుగోడు విజయంతో నల్గొండ మొత్తం టీఆర్ఎస్ వశమైంది. ఆ జిల్లా మొత్తం కేసీఆర్ హ్యాండోవర్‌లో ఉంది గనుక కామ్రేడ్స్‌కు అక్కడ సీట్లు కేటాయించడం సందేహాస్పదమే. పాలేరులో సీపీఎంకు మంచి పట్టున్నప్పటికీ అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ ఉంది. గతంలో తుమ్మలపై కాంగ్రెస్ తరపున గెలిచిన ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈసమయంలో మధ్యలోకి సీపీఎం ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. అయితే తుమ్మల ఏ క్షణమైనా వేరే పార్టీలోకి జంప్ కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాబోయే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాలేరు హాట్ సీట్‌గా మారుతోంది.