తన కూతురిని బీజేపీలో చేరమని అడిగారన్న కేసీఆర్
కవితను తమ పార్టీలో చేరాలని ఎవరూ అడగలేదన్న రఘునందన్‌రావ్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడి తీసుకొచ్చినట్లే తన కూతురు కల్వకుంట్ల కవితను కూడా వారి పార్టీలో చేరాలని బీజేపీ ఒత్తిడి చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్లమెంటరి, లెజిస్లేటివ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రలోభాలకు లొంగి రాజకీయ భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఎవరైనా పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొస్తే తనకు చెప్పాలని సూచించారు. ఫామ్‌హైస్ డీలింగ్పై తన వద్ద 5 టిబి డేటా ఉందన్నారు. బీజేపిని దోషిగా నిరూపించడానికి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఫామ్‌హౌస్ డీలింగ్ వ్యవహారంలో బీజేపీ ప్రమేయం ఉందని నిరూపించడానికి సిట్‌ను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ తో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా ఈడీ, ఐటీ బృందాలు రాష్ట్రంలో తరచుగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ఉందని గతంలోనే బీజేపీ ఆరోపించింది. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు. ఆయన నోటి నుంచి ఎవరెవరి పేర్లు బయటకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కవితను తమ పార్టీలో చేరాలని బీజేపీ ఒత్తిడి చేసిందని కేసీఆర్ ప్రకటించడం కలకలం రేపింది. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రేపో మాపో కవితకు ఈడీ నోటీసులు రాబోతున్నాయని ఒకవేళ కవితకు ఈడీ నోటీసులు పంపిస్తే బీజేపీ ఒత్తిడికి కవిత తలొగ్గలేదు కనుకే ఆమెకు ఈడీ నోటీసులు పంపించారని ప్రచారం చేసుకోవడానికే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని రఘునందన్‌రావు అన్నారు. ప్రజల దృష్టి మరల్చి సానుభూతి పొందడానికే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు తాము త్వరలో ఎన్డీయేలో భాగస్వామ్యం కాబోతున్నామని చాలా సార్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి విషయానికి వస్తే కవితను తమ పార్టీలో చేరాలని తాను కానీ బీజేపీ పెద్దలు కానీ ఆహ్వానించలేదని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలనేది అందరికీ తెలుసన్నారు. మొత్తానికి తెలంగాణలో ఒకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిట్ విచారణ జరుగుతుంటే మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ కొనసాగుతోంది. చివరికి ఈ కేసుల్లో ఎవరు దోషులుగా తేలతారో తెలియదు.