ఇరవై వస్తే ఎక్కువ.. రాజుగారి చిలకజోస్యం

By KTV Telugu On 17 November, 2022
image

వైనాట్‌ 175.. 150 తీసేయాలంటున్న ఆ ఎంపీ

వైనాట్‌ 175. వింటానికి బానే ఉంది. కానీ దేశంమొత్తం కాషాయపతాకని రెపరెపలాడించాలనుకుంటున్న బీజేపీ కూడా ఇంత ఓవర్‌కాన్ఫిడెన్స్‌గా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో మరోసారి గట్టెక్కితే చాలన్నట్లుంది కమలంపార్టీ పరిస్థితి. ఐదేళ్లు పాలిస్తేనే ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. నాలుగుసీట్లు తగ్గుతాయేగానీ పెరగడం అన్నది దింపుడు కళ్లెం ఆశ. ఆ ప్రభుత్వం అద్భుతాలు చేస్తే తప్ప అది అసాధ్యం. తాను చేసేవన్నీ ‘అద్భుతాలే’కాబట్టి ఈసారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు కొట్టాలని వైసీపీ టార్గెట్‌ పెట్టుకుంది. కేడర్‌నీ, లీడర్లనీ ఇదే టార్గెట్‌తో తోమేస్తోంది. అంటే వైసీపీ లెక్కప్రకారం చంద్రబాబు కూడా కుప్పంలో గెలవరన్నమాట!

ఏపీలో ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందనీ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం తమదేనని టీడీపీ తొడగొడుతోంది. ఇక ఒక్కఛాన్స్‌ అంటూ కొత్తరాగం ఎత్తుకున్న జనసేనాని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానంటున్నారు. ఎవరి వ్యూహాలు వారివి. మరి వైసీపీ టార్గెట్‌ వర్కవుట్‌ అవుతుందా అంటే బ్యాటింగ్‌ దిగినప్పుడు ఎవరన్నా నాటౌట్‌గా ఉండాలనే కోరుకుంటారు. ఏపీలో వైసీపీ వైనాట్‌ 175 అంటూ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతుంటే అంత సిన్మా లేదంటున్నారు అదే పార్టీకి చెందిన ఎంపీ. గెలిచింది ఫ్యాన్‌ గుర్తుతోనైనా ఆ పార్టీకి బద్దశత్రువుగా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎవరికెన్ని సీట్లొస్తాయో చిలకజోస్యం చెబుతున్నారు.

నరసాపురం రాజుగారి లెక్కప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందట! 175 సీట్లు దేవుడెరుగు  గట్టిగా ఓ ఇరవై సీట్లొస్తే ఎక్కువ అంటున్నారు రఘురామకృష్ణరాజు. ఏపీ ప్రజలు వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటూ ఓ సర్వేని తెరపైకి తెస్తున్నారు. తమ ఆశలపై నీళ్లు చల్లిన వైసీపీకి జనం వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తారని చెబుతున్నారు. వైసీపీ చేయించుకున్న సర్వేల్లోనే ఆ పార్టీకి 40 సీట్లు వస్తాయని తేలిందని రఘురామకృష్ణరాజు బల్లగుద్దుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఘోరంగా ఉంటుందంటున్నారు. పీకే కూడా జగన్‌కి అదే విషయం చెప్పారట. అది ఆ నోటా ఈనోటా రాజుగారి చెవిలో పడిందట!