నూతన జవసత్వాల కోసం నానా తంటాలు…

By KTV Telugu On 18 April, 2022
image

ముగ్గురు సభ్యులుంటే ఆరు గ్రూపులుండే పార్టీ అది. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా నాయకుల మధ్య విభేదాలు షరా మామూలుగా కొనసాగుతాయి. ఒకరు రెండు మెట్లు పైకి ఎక్కితే.. మిగతా వాళ్లంతా కలిసి నాలుగు మెట్లు కిందకు లాగే వ్యవస్థ అది. కొట్టకుంటూనే ఐక్యత నటించే తత్వం ఆ పార్టీది.. అదే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఉనికి కోసం పాట్లు పడుతున్న పార్టీ కూడా అదే…

రాహుల్ సంస్కరిస్తారని ఎదురుచూపు

తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఐక్యత సాధించేందుకు రాహుల్ వస్తున్నారట. మే 6,7 తేదీల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తారని టీ. కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్ వచ్చి పేచీలు తీరుస్తారని, విభేదాలు మరిచి కలిసి పనిచేస్తే విజయం సాధిస్తారని ఆయన మాటగా చెబుతారని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ సమక్షంలోనే తిట్ల దండకం అందుకున్న నేతలను ఒక తాటిపై నిల్చోబెట్టడం అంత సులభం కాదని కార్యకర్తలు తెలుసుకోవాలి..

నిజానికి టీ కాంగ్రెస్ లో 90 శాతం మంది నేతలు రాహుల్ కంటే సీనియర్లే. చాలా కాలంగా పార్టీని భుజాన ఎత్తుకుని నడిపిస్తున్నామన్న ఫీలింగ్ ఉన్నవారే. తాము లేకేపోతే రాహుల్ లేరని మనసులో అనుకునేవారే. అలాంటి వారిని బుజ్జగించి ఈ సారి గెలిపించండని అడిగేందుకు రాహుల్ వస్తున్నారు. తలకు మించిన భారంతో ఆయన హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతారనే అనుకోవాలి..

పార్టీ అధికారాన్ని కోల్పోయి రెండు ఎన్నికలు దాటిపోతోంది. మూడో ఎన్నికల్లో గెలవాలంటే అందరూ కలిసి పనిచేయాలి. ఐకమత్యంగా ఉండాల్సిన నేతలు ఇప్పుడు టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగంగానే విమర్శిస్తూ….కార్యకర్తల్లో అయోమయ స్థితిని సృష్టిస్తున్నారు. జగ్గారెడ్డి, వీ హనుమంతరావు, కోమటిరెడ్డి లాంటి నేతలు విభిన్న ధృవాలుగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు.. జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరినంత పనిచేసి.. మళ్లీ ఆగారు. వీ హనుమంతరావుకు ఎన్నికల్లో డిపాజిట్ రాకపోయినా….సీఎం పదవిని ఆశిస్తుంటారు పార్టీ గెలిస్తే తనకే సీఎం పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగానే చెప్పేశారు. ఇక జానారెడ్డి నేను సైతం అంటూ ఉంటారు. పాపం పెద్దాయన.

శక్తిమంతమైన టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎదుర్కోగలదా..

తెలంగాణలో టీఆర్ఎస్ ఇప్పుడు శక్తిమంతమైన అధికారపార్టీ. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ప్రజల్లో ఉంటున్న పార్టీ. సీఎం కేసీఆర్ అత్యంత పాపులర్ నేత మంత్రులు నిత్యం జనంలో తిరుగుతూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. ఎన్నికల నాటికి ప్రజల్లోకి వెళ్లి చెప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతు బంధు, దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సాగు నీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు ఉండనే ఉన్నాయి. మరో పక్క కాంగ్రెస్ అధికాారాన్ని కోల్పోయి దాదాపు పదేళ్లు కావొస్తోంది. కాంగ్రెస్ నేతలు జనంతో కనెక్షన్ పోగొట్టుకున్నారు. జనం కోసం మొక్కుబడిగానే పోరాటాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజాసేవలో చిత్తశుద్ధి లోపించి.. అంతర్గత కుమ్ములాటకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అదే ఇప్పుడు శాపమైంది…

ఇకనైనా నాయకత్వాన్ని గుర్తించరా…

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఔట్ సైడర్. పార్టీలో ఇటీవలే చేరినా ఫైర బ్రాండ్ ఇమేజ్ తో పీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. దానితో సీనియర్లు ఆగ్రహం చెందిన మాట వాస్తవం. అయినా సమయం మించిపోతోంది. కొట్టుకుంటూ మిగిలిన కాలాన్ని గడిపేసే కంటే..అందరూ కలిసి జనంలోకి వెళ్లి పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రోది చేయాల్సిన అవసరం ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించాలి. అప్పుడే పార్టీకి పూర్వ వైభవం వచ్చేందుకు కాస్తైనా అవకాశం ఉంటుందా…

చతుర్ముఖ పోటీ ఉంటుందా..

తెలంగాణలో ఇప్పటి వరకు త్రిముఖ పోటీ ఉంటుందని ఎదురు చూశారు. అధికార టీఆఎస్ కు కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇవ్వొచ్చన్న విశ్లేషణలు వినిపించాయి. టీఆఎస్ కు తామే ఏకైక ప్రత్యామ్నాయమని మిగతా రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు నాలుగో పార్టీ కూడా వచ్చి చేరే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తెలంగాణలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. రాజకీయ నిరుద్యోేగులు ఆ పార్టీలో చేరితే కనీసం చూడటానికైనా ఆప్ శక్తిమంతంగా కనిపించొచ్చు. కోదండరాం, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరితే సీన్ మారిపోవచ్చు. అప్పుడు చతుర్ముఖ పోటీ ఖాయం కావచ్చు. కాంగ్రెస్ కు మరింత గడ్డు కాలం ఎదురు కావచ్చు. ఆ పరిస్తితిని సైతం అధిగమించేందుకు కాంగ్రెస్ సిద్ధం కావాలి….