ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాడు ఈ సూపర్‌స్టార్
ప్రయోగాలకు ఆయన ముందుండేవారు. సాహసం చేయాలంటే కృష్ణ తర్వాతే ఎవరయినా. భయమనేది ఆయన బ్లడ్‌లోనే లేదు. అందుకే ఐదున్నరదశాబ్దాలుగా ఆయన సినీ వినీలాకాశంలో వెలుగు తరగని ధ్రువతారగా నిలిచారు. నటన ఆయన ప్రాణం. ఆయనే ఏ పాత్రకయినా జీవం. ఎన్నో అరుదైన రికార్డులు కృష్ణ సొంతం. టాలీవుడ్ నటుల్లో ఎందరు హీరోలున్నా కృష్ణదో ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఒకే ఒక్క స్టార్ ఈ సూపర్‌స్టార్. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా తన ప్రతిభను చాటుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటశేఖర కృష్ణ.
సిన్మాల్లో డబుల్‌రోల్ అంటేనే అబ్బో అంటాం. సాధారణంగా ఏ హీరో అయినా ద్విపాత్రాభినయం వరకు రిస్క్ తీసుకుంటారు. కానీ ఒకే సిన్మాలో భిన్నమైన పాత్రల్లో నటించడం అరుదైన విషయం. ఆ సవాలుని స్వీకరించి అభిమానుల్ని అలరించటం ఒక్క సూపర్ స్టార్‌కే సాధ్యమైంది. త్రిపాత్రాభినయంతో నటనకే కొత్త భాష్యం చెప్పారు కృష్ణ. మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం సినిమాల్లో ఆయన త్రిపాత్రాభినయంతో అలరించారు. కుమారరాజాలో తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలనీ ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది.
కుమారరాజా తర్వాత కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్-సినీ యాక్టర్. ఆ సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడిగా కూడా నటశేఖరుడే నటించారు. ఆ తర్వాత పగపట్టిన సింహం సినిమాలో విలన్‌గా, పోలీసాఫీసర్‌గా, లాయర్‌గా మూడు భిన్నమైన పాత్రల్లో అందరినీ మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు కృష్ణ.