టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్‌ జగన్ ప్రస్తావన

By KTV Telugu On 17 November, 2022
image

జగన్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు
అయినా వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న కేసీఆర్‌

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వదిలిపెట్టుకోదల్చుకోలేదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంగళవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను ఫిరాయింపులను ప్రోత్సహించిన తీరుపై ఈ సమావేశంలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఏకంగా తన కూతురు కల్వకుంట్ల కవితను కూడా పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్‌. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావన తీసుకొచ్చారు కేసీఆర్‌. వైఎస్ జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగానే ఉన్నారని కేసీఆర్ చెప్పారు. తమకు జగన్ అనుకూలంగా ఉన్నా ఆయన నేతృత్వంలోని వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అంతకుముందు ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని నమస్తే తెలంగాణ పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. సిట్ దర్యాప్తులో ఈ విషయం వెల్లడయిందని తెలిపింది. తెలంగాణ మాదిరే మరో మూడు రాష్ట్రాల్లో ఇదే తరహా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది. వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని వీరిలో 55 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మధ్యవర్తులతో టచ్ లో ఉన్నారని ఆ పత్రిక రాసింది. ఏపీ సీఎం ప్రభుత్వానికి బీజేపీ నుంచి ముప్పు ఉందని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను జగన్‌ ప్రస్తావన తీసుకొచ్చి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది.