ఢిల్లీ చరిత్రలోనే హారర్‌ క్రైమ్‌..పోలీసులకు ఛాలెంజ్‌!

By KTV Telugu On 17 November, 2022
image

35 ముక్కలు..18రోజులు ఫ్రిజ్‌లో.. కేసు తేలేదెలా?

వందలకేసుల్ని అలవోకగా ఛేదించిన పోలీసులకు కూడా మింగుడుపడని హారర్‌ క్రైమ్‌ అది. సహజీవనం చేసే అమ్మాయిని దారుణంగా చంపేసి చికెన్‌ముక్కల్లా ఫ్రిజ్‌లో పెట్టేసి రోజుకో ముక్క మాయం చేసిన దారుణం గురించి విని ఢిల్లీ ఉలిక్కిపడింది. ప్రియుడు ఆఫ్తాబ్‌ చేతిలో హత్యకు గురైన శ్రద్ధావాకర్‌ మృతదేహంలో ఇప్పటిదాకా కొన్ని ముక్కలే దొరికాయి. డీఎన్‌ఏతో ఆ శరీరభాగాలు ఆమెవేనని నిర్ధారించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఢిల్లీపోలీసులు. మిగిలిన శరీరభాగాలకోసం ప్రయత్నిస్తున్నారు. సంఘటన జరిగి ఆర్నెల్లు కావటంతో ఈ ఘటనలో ఆధారాలను నిరూపించడం పోలీసులకు పెద్ద సవాలుగానే ఉంది.

ఆర్నెల్లక్రితం శ్రద్ధను చంపేసి 18రోజులపాటు ఆమె శరీరభాగాలు ఫ్రిజ్‌లో పెట్టాడు నరరూప రాక్షసుడైన ఆఫ్తాబ్‌. గూగుల్‌ సెర్చింగ్‌కి తోడు క్రైమ్‌ సిరీస్‌ ప్రేరణతో చిన్న రక్తపుమరక కూడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. పడేసిన చోట ఇప్పటిదాకా శరీరభాగాలు ఎందుకుంటాయి. చెత్తలో కలిసిపోవడమో, ఏ జంతువులో తినేయడమో జరుగుతుంది. అందుకే ఈ ఆర్నెల్లలో గుర్తుతెలియన శరీరభాగాలు దొరికిన సంఘటనల గురించి ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఏడాది మే18న తాను గుడ్డిగ నమ్మిన ఆఫ్తాబ్‌ చేతిలో దారుణహత్యకు గురైంది శ్రద్ధా. అయితే ఆమె హత్య జరిగిన కొద్ది రోజులకే తూర్పు ఢిల్లీలో ఓ చోట కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు దొరికిన విషయాన్ని ఈ కేసుతో పోల్చి చూస్తున్నారు.

జూన్‌లో కొన్ని గుర్తుతెలియని శరీరభాగాలు, ఓ చెత్తకుప్పలో తల, చేతులను పోలీసులు గుర్తించారు. అక్కడ పడేయడానికి వాటిని ఫ్రిజ్‌లో భద్రపర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆఫ్తాబ్‌ కూడా ప్రియురాలి శరీరభాగాలను 18రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టటంతో పోలీసులు పాత ఘటనల వివరాలు తిరగేస్తున్నారు. హత్య తర్వాత గుర్తించడానికి వీల్లేకుండా తలభాగాన్ని కాల్చి తర్వాత పారేసినట్లు నిందితుడు చెబుతున్నాడు. దీంతో శ్రద్ధావాకర్‌ హత్య తర్వాత అప్పట్లో దొరికిన అవయవాలపై పోలీసులు దృష్టిపెట్టారు. ఐదునెలల క్రితం తూర్పు ఢిల్లీలో దొరికిన తల, చేతుల భాగాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో అవి శ్రద్ధాకి చెందినవో కాదో తేలబోతోంది. మొత్తానికి ఢిల్లీ పోలీసుల సమర్థతకు శ్రద్ధ కేసు పెద్ద పరీక్షే పెడుతోంది.