నా భార్యని అవమానించారు..బాబు మర్చిపోలేదు!
చివరి ఎన్నికలంటే.. ఓడిపోతే అస్త్ర సన్యాసమేనా?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ పోయిన్సారి ఆయన లెక్క తప్పింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన ప్రతిపక్షనేతగా మిగిలిపోయారు. ఓడిపోవడం కంటే దారుణపరాభవం రాష్ట్రంలో చేదు అనుభవాలు రాజకీయంగా దెబ్బకొడుతున్నాయి. మానసికంగా మరింత కుంగదీస్తున్నాయి. వైనాట్ 175 అంటూ టీడీపీని జీరో చేయాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత రాజకీయవిమర్శలకు భావోద్వేగాలను జోడిస్తున్నారు.
నన్ను గెలిపిస్తే కౌరవసభను గౌరవసభగా మారుస్తా. నాకివే చివరి ఎన్నికలు అంటూ కర్నూలు టూర్లో చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఏం చేయాల్లో మీ చేతుల్లోనే ఉందంటూ ప్రజల మీద పెద్ద భారాన్నే పెట్టారు. అప్పుడెప్పుడో అసెంబ్లీలో తన భార్యని నిందించారని కన్నీటిపర్యంతమయ్యారు చంద్రబాబు. రాజకీయ జీవితంలో ఆయన వెక్కివెక్కి ఏడ్వటం అదే మొదటిసారి.
మేమేం అన్లేదు మొర్రో అని వైసీపీ నేతలు చెప్పుకునే ఆ అవమానభారాన్ని ఆయన తలమీద మోస్తూనే ఉన్నారు. తన భార్య భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారని మరోసారి గుర్తుచేసుకుని బాధపడ్డారు. భువనేశ్వరిని ఎవరేమన్నారో ఎవరూ విన్లేదు. విన్నవారెవరో ఆయన చెవిన వేశారు. దానిమీద కొడాలినాని, వల్లభనేని వంశీలాంటి నోరుపారేసుకునే నేతలు కూడా వివరణలిచ్చారు. ఆ మ్యాటర్ ఎప్పుడో ముగిసిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం అంత తేలిగ్గా వదలాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరన్నా తొందరపాటులో నోరు పారేసుకుని ఉన్నా పదేపదే అలాంటి సున్నిత విషయాలు ఎవరూ ప్రస్తావించరు. కాలమే గాయాన్ని మాన్పుతుందని అలాంటివి మరిచిపోవడానికే పయత్నిస్తారు.
కానీ జనంలో సెంటిమెంట్‌ని జోడించడానికి చంద్రబాబుకి అది కూడా ఓ బ్రహ్మాస్త్రంలా మారిపోయింది. నా భార్యని అనరాని మాటలు అన్నారని, దారుణంగా అవమానించారని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. రేపు లోకేష్ కూడా తన తల్లికి అవమానం జరిగిందని, ప్రతీకారం తప్పదని చెప్పుకున్నా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. కొత్త ఎత్తుగడలు అనుసరించాలి. అంతేగానీ ఇళ్లలో ఆడోళ్లని ఇలా వీధికి లాగడమేంటన్న చర్చ జరుగుతోంది. వైసీపీ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొడుతోంది. సహధర్మచారిణిని చంద్రబాబే ఎక్కువగా అవమానిస్తున్నారంటోంది. వైసీపీని ఎదుర్కునేందుకు చంద్రబాబు అమ్ములపొదిలో దీనికి మించిన అస్త్రాలు లేనేలేవా? అవినీతి, అక్రమాలు, పక్షపాతం, అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తూనే బయటికి తీసిన సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా?