నిన్న మొన్నటి దాకా.. ఆయన వైసీపీ పార్టీలో నెంబర్ టు.. ఇప్పుడేమిటంటే…. ఏమో తెలీదని సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడేం పోయిందీ నెంబరు 200 అనుకోండి అని సమాధానం వినిపిస్తోంది. పార్ట్ టైమ్ ఆడిటర్, ఫుల్ టైమ్ పోలిటీషన్ అయిన వెనుంబాక విజయ సాయి రెడ్డి దుస్థితి ఇదీ.. నాడు వైఎస్ హయాంలోనూ, తర్వాత జగన్ పాలనలోనూ ఆయన ఒక వెలుగు వెలిగారు. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అని కూడా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ అగ్రనాయకత్వం నుంచి వచ్చిన సంకేతాలు విజయసాయికి ప్రతికూలంగానే అనిపించాయి. ఫైనల్ గా ఊహించని దెబ్బే తలిగింది…విజయసాయిని ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించేశారు..
వైఎస్ పాలనలో విజయసాయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు.. ఎవరేమన్నా అడిగితే.. అన్నీ సాయి చూసుకుంటున్నారు..ఓ సారి ఆయన్ను కలవండి.. అని సమాధానం వచ్చేది. పని ఉన్న వారు అనివార్యంగా విజయసాయిని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేది. వైఎస్ తర్వాత జగన్ వైసీపీ పెట్టిన కొత్తల్లో కూడా విజయసాయి కీలక నేతగా కొనసాగారు. జగన్ అధికారానికి వచ్చిన తర్వాత విజయసాయిని ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా నియమించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ బాధ్యతలు విజయసాయికి అప్పగించారని చెప్పుకునే వారు. విజయసాయి కూడా ఎక్కువ సమయం విశాఖలోనే గడుపుతూ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. రాజ్యసభ సభ్యుడిగానూ, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గానూ, పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్నప్పటికీ తన ఫస్ట్ ప్రియారిటీ విశాఖేనన్నట్లుగా వ్యవహరించే వారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఆయనకే రిపోర్ట్ చేసేవారు. అవసరమైతే పంచాయతీలు పెట్టేవారు. దందాలు చేసే వారు.. ఉత్తరాంధ్రలో విజయసాయి ఆజ్ఞలేనిదే చీమ కూడా కుట్టదన్నట్లుగా వైసీపీ రాజకీయాలుండేవి….
జగన్ కు సంబంధించిన చాలా కేసుల్లో విజయసాయి కూడా నిందితుడు ( ఏ2) ఆయన రోజు వారీ కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉన్నా… రాజ్యసభ సభ్యుడు కావడంతో కొంత ఇమ్యూనిటీ పొంది స్వేచ్ఛగా తిరుగుతున్నారు. జగన్ కుటుంబానికి కూడా విజయసాయి సన్నిహితుడే… కాకపోతే ఇటీవలి కాలంలో విజయసాయి రెడ్డిపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. విశాఖలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అందరినీ కలుపుకుపోవడం లేదని స్థానిక నేతల నుంచి జగన్ కు ఫిర్యాదు అందిందట. అప్పటి నుంచి జగన్ ఆయన్ను ఒక కంట కనిపెట్టి ఉంచారని సమాచారం..
జగన్ కళ్లుగప్పి విజయసాయి దందాలు చేస్తున్నారని చాలా రోజుల్లుగా ఆరోపణలు పెల్లుబికాయి. భారీ స్థాయిలో భూకబ్జాలు చేశారని చెబుతున్నారు.విశాఖ మొత్తం తనదేనన్నట్లుగా విజయసాయి వ్యవహరిస్తున్నారు. ఎవరినీ లెక్కచేయకుండా, ఏదైనా ఉంటే తానే జగన్ తో మాట్లాడుకుంటానని సమాధానం ఇచ్చేస్తున్నారు. దీనితో జగన్ కు వేలాది ఫిర్యాదులు అందాయి. విజయసాయి తీరు సీఎం జగన్ కు శిరోభారమైంది. దానితో విజయసాయిని డైవర్ట్ చేసేందుకు విశాఖ నుంచి తప్పించారని విశ్లేషణలు వస్తున్నాయి. తిరుపతిలో విజయసాయి నిర్వహించిన జాబ్ మేళా కూడా ప్రహసనంగా మారింది.మరో పక్క నాలుగు మూడు నెలలుగా విజయసాయి రెడ్డిని జగన్.. ఊరించి, ఉరికించి, నిరాశ పరుస్తున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా విజయసాయి కొన్ని పేర్లను జగన్ పరిశీలినకు పంపారు. వాటిని సజ్జల రామకృష్ణారెడ్డికి పంపాలని జగన్ ఆదేశించారు. చివరకు విజయసాయి లిస్ట్ సజ్జలకు చేరగా…ఆయన బుట్టదాఖలు చేశారు. విజయసాయి లిస్టులో ఒక నాయకుడికి కూడా మంత్రివర్గంలో చోటు దొరకలేదు…
ఇప్పుడేం జరగబోతోంది ?
విజయసాయి రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది జూన్ 21న ముగుస్తుంది. ఆయనకు మరో ఛాన్స్ రాకపోవచ్చని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో పార్టీకి సేవలు అందించాలని సందేశమిస్తూ జగన్ ఆయన్ను రాజ్యసభకు దూరంగా ఉంచుతారని చెబుతున్నారు. తద్వారా ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు కూడా విజయసాయిని దూరం చేసే వీలుంటుందని జగన్ విశ్వసిస్తున్నారట. బీజేపీ నేతలతో విజయసాయి మితిమీరిన స్నేహం చేస్తున్నారని జగన్ అనుమానిస్తున్నారట…ప్రస్తుతానికి పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయసాయికి అప్పగించారు. త్వరలోనే మరికొన్ని పార్టీ బాధ్యతలు అప్పగించే వీలుంది. తర్వాత ఏం చేయాలో… విజయసాయి సేవలను ఎలా వినియోగించుకోవాలో జగన్ నిర్ణయించుకుంటారు. ఈ దిశగా సజ్జల సలహాలు పాటించే అవకాశాలూ లేకపోలేదు…