వైఎస్ ప్రమాద ఘటనపై నల్లారి ఏం చెప్పారు?

By KTV Telugu On 18 November, 2022
image

నల్లారితో బాలయ్య ఇంటర్వ్యూ.. వైఎస్సార్ ప్రస్తావన
బతికుండబట్టే సీఎం అయ్యానంటూ కామెంట్
హెలికాప్టర్ ప్రమాదంపై మాజీ సీఎం ఏం చెప్పారు?
వైఎస్ఆర్‌ను మిస్ గైడ్ చేసిన ఆ మంత్రి ఎవరు?
రాజకీయ సంచలనాలకు వేదికగా అన్ స్టాపబుల్ షో

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షో రాజకీయ సంచలనాలకు వేదికగా మారుతోంది. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ పెద్ద బ్లాస్టింగే అయ్యింది. ఎన్టీఆర్ ను పదవి నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెబుతూ, అందులో బాలయ్య ఇన్ వాల్వ్ మెంట్ గురించి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఎపిసోడ్ తీవ్ర దుమారమే రేపింది. ప్రోమో విడుదలైనప్పటి నుంచి షో టెలికాస్ట్ అయిన కొద్దిరోజుల వరకు టీడీపీ, వైసీపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జరిగాయి. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో బాలయ్య చేసిన షో.. అంతకుమించి అన్నట్టుగా ఉంది. తన కాలేజీ స్నేహితులైన కిరణ్ కుమార్ రెడ్డితో పాటు, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలను బాలయ్య షోకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాలేజ్ డేస్ నుంచి కిరణ్ సీఎం అయిన వరకు సాగిన ముచ్చటను ప్రోమో రూపంలో విడుదల చేశారు.

ఈ టాక్ షోలో కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మీరు సీఎం కావడానికి కారణమేంటని బాలకృష్ణ అడగగా బతికి ఉండబట్టే తాను సీఎం కాగలిగానంటూ సమాధానమిచ్చారు. అంతేకాదు ఓ సీనియర్ మంత్రి తన విషయంలో వైఎస్ఆర్ ను తప్పుదోవ పట్టించారంటూ నాటి ఘటనను గుర్తు చేశారు నల్లారి. దీంతో ఆ మాజీ మంత్రి ఎవరు, అసలేం జరిగిందనే ట్విస్ట్ నెలకొంది. అయితే ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైఎస్ క్యాబినెట్‌లో, ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో ఉన్న చిత్తూరుకు చెందిన కీలక నేత గురించే కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారని టాక్. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ఆ సీనియర్ నేత ప్రత్యర్థిగా ఉండేవారు. జగన్ సిఫార్స్ మేరకే అప్పట్లో ఆయన్ను వైఎస్ మంత్రివర్గంలోకి తీసుకున్నారనే టాక్ ఉంది. సదరు నేత కారణంగానే కిరణ్‌కు, జగన్‌కు మధ్య దూరం పెరిగిందనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. వైఎస్ఆర్‌కు, కిరణ్‌కు మధ్య ఆయన తగువులు పెట్టే ప్రయత్నం చేశారని కిరణ్ వర్గం చెబుతోంది.

ఇక టాక్ షోలో వైఎస్సార్ ప్రస్తావన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని నల్లారి ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నల్లారి ఏం చెప్పి ఉంటారనే ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా బాలకృష్ణ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించారు. ఎంతోమంది గొప్ప నాయకులను కోల్పోయామని అలాంటి వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరని చెప్పారు. వైఎస్సార్ మరణానంతరం అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్ మృతితో రోశయ్య కొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య ఎవరూ ఊహించని విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దానిపై తాజా ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రోమోలో ఆ విషయాన్ని బాలయ్య హైలైట్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి, 2014 ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. ఆతర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. మధ్యలో కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లినప్పటికీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఈ ఎపిసోడ్‌లోనే సురేష్ రెడ్డి, అలనాటి హీరోయిన్ రాధికలుండడంతో ఎపిసోడ్‌పై హైప్ క్రియేట్ అవుతోంది.