గులాబీ దళపతి ప్రధానమంత్రి అవుతారా, బీఆర్ఎస్ కు ప్రజల్లో విశ్వసనీయత వస్తుందా తెలంగాణ ముఖ్యమంత్రికి దేశం మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది నేల విడిచి సాము చేస్తున్నట్లుగా తెలంగాణ అభివృద్ధిని గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా.. మరో ఏడాది కాలంలో జరగబోయేదేమిటి.. దేశం సంగతి సరే రాష్ట్ర భవిష్యత్తు ఏ మలుపు తీసుకోబోతోంది.
యావత్ భారతదేశంపై ప్రేమ
తెలంగాణ మోడల్ ను దేశమంతా విస్తరించాలన్న ఆలోచన
ఇంతకాలం తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడిన కేసీఆర్
గులాబీ దళం మద్దతు ఉంటే సరిపోతుందా.. ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యావత్ భారతదేశంపై ప్రేమ పుట్టుకొచ్చింది. తెలంగాణ సంక్షేమం తప్ప వేరే ధ్యాస లేని కేసీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను దేశమంతా విస్తరించే ప్రయత్నంగా ఆయన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ను స్థాపించి నెలదాటింది. కొంతకాలం క్రితం దాకా ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ పేరుతో అప్పుడప్పుడు దేశాటన చేసిన కేసీఆర్ ఈ సారి ఏకంగా నేషనల్ పార్టీకి జెండా పాతారు. ఇంతకాలం రాష్ట్రం దాటి వెళ్లని ఉద్యమపార్టీకి ఇప్పుడు జాతీయ ఆకాంక్షలు ఎందుకు వచ్చాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పార్టీ శ్రేణులు, గులాబీ బాస్ అనుచరులు మాత్రమే దేశ్ కీ నేత అని నినదిస్తే సరిపోతుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ ఏర్పాటులో బహుముఖ వ్యూహం
తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వకూడాదన్న ఆలోచన
రాష్ట్రంలో కాంగ్రెస్ ను పాతిపెట్టాలన్న కోరిక
జాతీయ స్థాయిలో సరికొత్త ప్రత్యామ్నాయం వెదకాలన్న ఆకాంక్ష
నిజానికి కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు తెలంగాణ గడ్డ మీద నుంచే మొదలయ్యాయి. జాతీయ పార్టీతో తెలంగాణ రాజకీయాలను కూడా చక్కదిద్దే వీలుంటుందని కేసీఆర్ ఆలోచిస్తుండొచ్చు. టీఆర్ఎస్ ను గద్దే దించే స్థాయికి బీజేపీ ఎదగడమే కేసీఆర్ కొత్త వ్యూహానికి కారణమై ఉండొచ్చు కూడా. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తే ఇక జనంలో తెలంగాణ ఇచ్చిన ఫీలింగ్ లేకుండా చేసే వీలుంటుందని కేసీఆర్ వ్యూహమై ఉండొచ్చు. పైగా బీజేపీ నేతలు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని దూకుడు పెంచడంతో వారికి బుద్ధి చెప్పేందుకే బీఆర్ఎస్ ను స్థాపించారన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇంతకాలం కేసీఆర్ ను పట్టించుకోని ప్రాంతీయ నేతలు
అందరినీ కలుపుకుపోయేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం విఫలం
ఫెడరల్ ఫ్రంట్ అటకెక్కడంతో జాతీయ పార్టీ
ప్రధానమంత్రి మోదీ తీరు కేసీఆర్ కు ఏ మాత్రం నచ్చలేదు. ప్రతీ రాష్ట్రంలో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాల ఎవరైనా ఆగ్రహం తెప్పిస్తాయి. అందుకే మోదీనే కూల్చేద్దామన్న ఆలోచన కేసీఆర్ కు వచ్చింది. బీజేపీపై పోరాటానికి కలిసి రావాలని ప్రాంతీయ శక్తులను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఆ దిశగా కొన్ని పొరపాట్లు జరిగాయి. కాంగ్రెస్ ను సైతం దూరం పెట్టే ఫ్రంట్ కోసం ప్రయత్నించారు. అందుకు మమత, స్టాలిన్, నితీశ్, హేమంత్ సోరెన్ లాంటి నేతలు విముఖత వ్యక్తం చేశారు. కేసీఆర్ స్వార్థం కోసం తమను కలుపుకుపోవాలని చూస్తున్నారన్న ఫీలింగ్ వారిలో వచ్చేసింది. ప్రత్యేకంగా వెళ్లి వారిని కలిస్తే శాలువలు కప్పి పంపారే తప్ప అందరం కలుద్దామన్న కోరికను మాత్రం బయట పెట్టలేదు. దానితో ఏపనైనా స్వయంగా చేసుకుంటేనే కరెక్టన్న ఆలోచనతోనే కేసీఆర్ పార్టీని స్థాపించారని భావించాల్సి ఉంటుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీ
తెలంగాణ వచ్చిన తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీ
పార్టీకి జాతీయ ఔట్ లుక్ కోసమే ప్రయత్నం
దేశ మంతా విస్తరించాలన్న కోరిక
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమైనప్పుడు టీఆర్ఎస్ కేవలం ఒక ఉప ప్రాంతీయ పార్టీగానే ఉంది. ఓపికకు, ఓర్పుకు ప్రతిరూపమైన కేసీఆర్ దశాబ్దంపైగా ఉద్యమం నిర్వహించి తెలంగాణ సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ బలమైన ప్రాంతీయ పార్టీగా స్థిరపడిపోయింది. 2018 ఎన్నికల్లో రెండో సారి అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ రాజకీయ ఆకాంక్షలు పెరిగాయి. ఇప్పుడు పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. అందుకే దేశమంతా విస్తరించాలన్న కోరిక ఆయనలో బలంగా పాతుకుపోయింది.
ఇంకా వ్యూహాలను బయట పెట్టని కేసీఆర్
కేజ్రీవాల్ బాటలో నడిచేందుకు వెనుకాడుతున్న తెలంగాణ సీఎం
గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో పోటీ చేయని బీఆర్ఎస్
బీఆర్ఎస్ కు ఇంకా ఈసీ గుర్తింపు రాలేదు. అయినా టీఆర్ఎస్ ను కేసీఆర్ ఆయన పార్టీ నేతలు బీఆర్ఎస్ గానే పరిగణిస్తున్నారు. కేసీఆర్ మంచి వ్యూహకర్త. పైగా తన వ్యూహలు పూర్తిగా అమలయ్యేంత వరకు ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడతారు. బీఆర్ఎస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. కేసీఆర్ ఏం చేయబోతున్నారో ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. తెలంగాణ దాటి బయటకు వెళ్లేందుకు ఆయన దగ్గరున్న పాచికలేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఎంతో నేర్పుగా ఒకసారి ఒక రాష్ట్రంపై దృష్టి పెడుతున్నారు. ఢిల్లీ తర్వాత పంజాబ్ లో గెలిచారు. ఇప్పుడు గుజరాత్ నుంచి బీజేపీని వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కేసీఆర్ ఇంకా అంత దాకా ఆలోచించలేదు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత వస్తున్న ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయడం లేదు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వైపు కేసీఆర్ చూడటం లేదు. కనీసం ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదు. అదేమంటే టైమ్ సరిపోవడం లేదని కొందరు టీఆర్ఎస్ నేతలు సమాధానమిస్తున్నారు.
బీఆర్ఎస్ కు 2023 కీలకం
ఇంకా స్పీడందుకోని బీఆర్ఎస్ పనులు
చేరికల పైనే కేసీఆర్ దృష్టి
కేసీఆర్ కుటుంబ పాలనే పెద్ద ప్రాబ్లం
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ నిలబడాలన్నా మనుగడ సాగించాలన్నా 2023 చాలా కీలకం. వచ్చే ఏడాది మధ్యలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఇంట గెలిస్తేనే కేసీఆర్ రచ్చ గెలిచే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టొచ్చు. బీఆర్ఎస్ పేరు ప్రకటించిన వెంటనే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం వెదుకుతున్న ఇతర రాష్ట్రాల నేతలు వచ్చి చేరతారన్న చర్చ జరిగింది. నెల గడిచినా కేసీఆర్ వైపు చూసిన వాళ్లు లేరు. ఇతర రాష్ట్రాల నేతలకు కేసీఆర్ పై విశ్వాసం ఉందన్న గ్యారెంటీ లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలను తమవైపు లాక్కొనే ప్రక్రియ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునే ప్రక్రియ వేగం పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే టీఆర్ఎస్ కు కొంత అడ్వాంటేజ్ రావచ్చు. తనయుడు కేటీఆర్ ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టి కేసీఆర్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పై దృష్టి పెట్టొచ్చు కాకపోత్ అవన్నీ అనుకున్నట్లు జరగాలి.
పొరుగు రాష్ట్రాలతో పేచీలు
కేసీఆర్ డైలాగులే పెద్ద ఇబ్బంది
ఒక పార్టీనైనా విలీనం చేసుకోగలరా
దేశం నిండా ప్రధానమంత్రి అభ్యర్థులే
ఆర్థిక, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పేచీ ఉంది. బీఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు ఏపీలో ఒకరిద్దరు ఔత్సాహికులు కేసీఆర్ కు అనుకూలంగా పోస్టర్లు వేసినా సాధారణంగా ఆయన పట్ల వ్యతిరేకతే ఉంది. విభజన గాయాలను ఏపీ జనం ఇంకా మరిచిపోలేదు. మహారాష్ట్రతో ప్రాజెక్టుల పంచాయతీ కొనసాగుతోంది. అందుకే పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరించడమే కష్టమని భావిస్తున్నారు. అలాంటి పరిస్తితుల్లో ఉత్తరాది దాకా ఎలా వెళతారన్నది పెద్ద ప్రశ్న. పైగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసి ఇన్ని రోజులైనా ఒక్క పార్టీ కూడా వచ్చి అందులో విలీనం కాలేదు. ఆవిర్భావ సభకు వచ్చిన జేడీఎస్ నేత కుమార స్వామి కూడా శుభాకాంక్షలు చెప్పారే తప్ప తమ పార్టీని విలీనం చేస్తున్నానని ప్రకటించలేదు. మరి బీఆర్ఎస్ అభివృద్ది ఎలా సాధ్యమన్నదే ప్రశ్న.
బీఆర్ఎస్ మాయలో తెలంగాణను వదిలేస్తున్నారా
అభివృద్ధికి అటకెక్కే ప్రమాదం ఉందా
హైదరాబాద్ ఆదాయం కూడా తగ్గుతోందా
ఉత్తర తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందా
బీఆర్ఎస్ పై దృష్టి పెట్టి, ప్రధాని కావాలన్న కోరికతో కేసీఆర్ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో అభివృద్దిని పరుగులు పెట్టించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతానికి పరిస్తితి ఉజ్వలంగానే కనిపిస్తున్నా సమస్యలు నివురు గప్పిన నిప్పులా విజృంభించే ప్రమాదం ఉంది. రాష్ట్ర జీడీపీ 11 పాయింట్ రెండు శాతానికి చేరడం దేశ స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ వాటా 4 పాయింట్ 9 శాతానికి పెరగడం, ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు కావడం, వ్యవసాయ ఉత్పత్తులతో గిడ్డింగులు నిండిపోవడం లాంటివి ఆశాజనక పరిణామాలే కావచ్చు. కాకపోతే సంక్షేమం పేరిట కేసీఆర్ చేస్తున్న ఖర్చు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోంది. నిధులు లేక ప్రభుత్వోద్యోగులకు వేతనాలు ఆలస్యమవుతున్నాయి సర్వం హైదరాబాదే అన్నట్లుగా ఇతర ప్రాంతాల వైపు ఇన్వెస్టర్లు చూడటం లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే ములుగు, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో వంద కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రావడం లేదు దానితో ప్రాంతీయ సమాన అభివృద్ధి లోపించి యువతకు ఉద్యోగావశాలు తగ్గుతున్నాయి. తగినంత విద్యుత్, నీరు ఉన్నప్పటికీ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వెనుకాడుతున్నారు. హైదరాబాద్ కు పట్టుకొమ్మగా నిలిచే సాఫ్ట్ వేర్ పరిశ్రమ కూడా మందగించిందన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ఏటా లక్షా 40 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తుంటే బెంగళూూరు నుంచి నాలుగున్నర లక్షల కోట్ల మేర సాఫ్ట్ వేర్ ఎగుమతి జరుగుతోంది. తెలంగాణ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని చెప్పుకునే కేసీఆర్ ఈ అంశాలపై దృష్టి పెట్టడం మానేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకరిద్దరి కోరికే కేసీఆర్ ధైర్యమా
ప్రధాని కావడం అంత సులభమా
ఉత్తరాది నేతలు ఒప్పుకుంటారా
టీఆర్ఎస్ ను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ అంటున్నారా
ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని తెలంగాణ పొరుగు ప్రాంతాల ప్రజలు తమను పక్క రాష్ట్రంలో విలీనం చేయాలని కోరుతున్నారు. కర్ణాటకలో ఉండే కంటే తెలంగాణలోకి వెళ్లిపోతే తమ ప్రాంతం బాగుపడుతుందని ఒక బీజేపీ నేత వ్యాఖ్యానించారు. అలాంటి చర్యలే కేసీఆర్ ధైర్యానికి కారణం కావచ్చు. వాస్తవం చెప్పాలంటే ప్రధాని పదవి దాకా వెళ్లడం అంత సులభం కాదు. గతంలో దేవెగౌడ, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ లాంటి నేతలు ప్రధానమంత్రిత్వం చేపట్టినా ఎక్కువ రోజులు కుర్చీలో కూర్చోలేకపోయారు. బలమైన జాతీయ పార్టీ నేత మాత్రమే ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండే అవకాశాలున్నాయని చరిత్ర చెబుతోంది. పైగా దక్షిణాది నేతల ఆధిపత్యాన్ని ఉత్తరాది వారు ఆమోదిస్తారన్న నమ్మకమూ లేదు. ఇలాంటి సంగతులన్నీ తెలియకుండానే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారని భావించడానికీ వీల్లేదు. బహుశా టీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు, బీజేపీ వత్తిడి నుంచి తట్టుకునేందుకే బీఆర్ఎస్ ను ప్రారంభించి ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.