టీఆర్‌ఎస్‌, బీజేపీ గొడవలో కులం కార్డు

By KTV Telugu On 19 November, 2022
image

కేసీఆర్‌ ఫ్యామిలీది కుల అహంకారం అన్న ఎంపి అరవింద్‌
కుల అహంకారంతోనే తన ఇంటిపై దాడి చేశారన్న ఎంపి

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య వార్‌ మొదలైంది. అది ముదిరి ముదిరి బీజేపీ ఎం.పి ధర్మపురి అరవింద్‌ ఇంటి మీద దాడి చేసేవరకు వెళ్లింది. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌లో చేరతానని మల్లికార్జున ఖర్గెకు ఫోన్‌ చేసిందని అరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు రెచ్చిపోయాయి. హైదరాబాద్‌లోని ఎంపీ ఇంటిమీద దాడిచేసి విధ్వంసం సృష్టిచారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజమాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతా అని కవిత ప్రెస్‌మీట్‌లో అరవింద్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే కొట్టి కొట్టి చంపుతామని హెచ్చరించారు. తన ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై బీజేపీ ఎంపి అరవింద్ మాట్లాడారు. విమర్శిస్తే ఇంటి మీద దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అయితే అనూహ్యంగా ఎంపీ కవిత కులం గురించి పలుమార్లు ప్రస్తావించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవితకు కుల అహంకారంతోనే కవిత తన ఇంటి మీద దాడి చేశారని ఆరోపించారు. వారిది కుల అహంకారం తప్ప ఏమీ కాదని అన్నారు.

మీడియాతో మాట్లాడిన ఆ కొద్ది సేపట్లో అరవింద్‌ దాదాపు పది పన్నెండు సార్లు ఆయన కులం ప్రస్తావన తీసుకొచ్చారు. మీదేమైనా దొరల పాలన అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాయకులు కేసీఆర్‌ ఫ్యామిలీది కులం అహంకారం అంటూ విమర్శించడం ఇదే మొదటి సారి. మామూలుగా కేసీఆర్‌ను దొర అని దొరల పాలన అని విపక్షాలు విమర్శిస్తాయి కానీ ఇలా కులం కార్డును ఎందుకు ప్రయోగించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కుల రాజకీయాలు చాలా ఎక్కువ. అక్కడ రాజకీయ సమీకరణాలన్నీ కులాల నేపథ్యంలోనే ఉంటాయి. సీట్లు, ఓట్లు కూడా కులాల లెక్కల ఆధారంగా చూస్తారు. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు కేసీఆర్‌ది కుల అహంకారం అని ప్రత్యేకంగా ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పడంలో ఏదైనా వ్యూహం ఉందా…? తెలంగాణలో కుల రాజకీయాలకు తెర లేపాలనుకుంటున్నారా ? అనే చర్చ మొదలైంది.