కాళ్లు మొక్కితే రాజకీయ నాయకుడు ఐపోవచ్చా ?

By KTV Telugu On 19 November, 2022
image

సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కిన హెల్త్‌ డైరెక్టర్‌
సోషల్‌ మీడియాలో డి.ఎం.హెచ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు

ఈ మధ్య కొందరు ఉన్నతాధికారులకు రాజకీయాలపై మోజు పెరిగిపోయింది. చేస్తున్న ఉద్యోగం వదిలేసి డైరెక్టుగా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అయిపోయవాలని కలలు కంటున్నారు. పెద్దవారనే గౌరవభావంతో కాళ్లు మొక్కతే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ కేవలం రాజకీయ పదవులు ఆశించి కాకా పట్టడానికే కాళ్లు మొక్కినప్పుడు మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో సిద్ధిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ శరత్ కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకి ఎక్కారు. అప్పుడు కలెక్టర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు 2016లో సిద్దిపేట జిల్లా మొట్ట మొదటి కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో పదవీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా ఆయన కేసీఆర్‌ కాళ్లు మొక్కారు. ఇలా అత్యున్నత సివిల్ సర్వెంట్లయిన ఐఏఎస్​ ఆఫీసర్లు ఇలా రాజకీయ నాయకుడి కాళ్లు మొక్కడం ఏమిటని జనం ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత కొన్ని రోజులకు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయిపోయారు. తాజాగా తెంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వివాదానికి తెర లేపారు.

టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ కాళ్లు మొక్కి విమర్శల పాలయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన కేసీఆర్‌కు రెండు సార్లు వంగి వంగి కాళ్లు మొక్కడం కనిపించింది. అది చూసిన నెటిజన్లు హెల్త్ డైరెక్టర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ వీడియోను మాజీ ఐయ్యేఎస్‌ ఆకునూరి మురళి షేర్‌ చేశారు. అంతేకాదు హెల్త్ డైరెక్టర్‌ తీరుపై మండిపడ్డారు. కొత్తగూడెం అసెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ గురించే శ్రీనివాస్ రావ్‌ సీఎం కాళ్ళు పట్టుకున్నారు. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి అని మురళి ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలో తనకు తాను దేవతగా అభివర్ణించుకున్న ఒక మహిళ నిర్వహించిన ఓ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెల్త్‌ డైరెక్టర్ అయి ఉండి మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని అప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఇలా సీఎం కాళ్లు మొక్కి మరోసారి వివాదాస్పదం అయ్యారు. ఇది చూసిన నెటిజన్లు శ్రీనివాసరావు మీద సెటైర్లు వేస్తున్నారు. పదవి కాలం పొడిగించాలని కాళ్లు మొక్కుతున్నారా లేక కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసమా అని ప్రశ్నిస్తున్నారు.