న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్..వర్షం అడ్డంకి
తొలి మ్యాచ్ వర్షార్పణం..రేపు సెకండ్ టీ20 డౌటే!
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్. భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన రెండో టీ 20 కూడా వర్షం కారణంగా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెల్లింగ్టన్లో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. రేపటి రెండో మ్యాచ్‌కోసం మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో తలపడేందుకు ఇరుజట్లు సన్నద్ధణవుతున్నాయి. అయితే, రెండో టీ 20పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా సాధ్యపడే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. 90 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. అయితే వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే మాత్రం కొద్ది ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశాలు లేకపోలేదని తెలిపింది.
టీ20 వరల్డ్‌కప్ అనంతరం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ న్యూజిలాండ్ టూర్‌కు యువజట్టును పంపింది. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నారు. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, ఉమ్రాన్ మాలిక్, రిషబ్ పంత్, సంజు శాంసన్‌లకు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది.
టీ 20 వరల్డ్ కప్‌లో గ్రూప్ 1,2ల నుంచి అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్, భారత్‌లు సెమీస్‌లో పరాజయం పాలయ్యాయి. తదనంతరం జరుగుతున్న ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టులో పెద్దగా మార్పులేవీ లేనప్పటికీ ఇండియా మాత్రం యంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతోంది. సీనియర్లు లేని ఈ జట్టును కొందరు ద్వితీయ శ్రేణి జట్టుగా పరిగణిస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలను న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ కొట్టిపారేస్తున్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టులో లేకపోయినా ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలిగే సామర్థ్యం టీమ్ఇండియాకు ఉందని కేన్ అభిప్రాయపడ్డాడు.