పిక్చర్ క్లియర్ .. బెంగాల్‌గా మారుతున్న తెలంగాణ !

By KTV Telugu On 21 April, 2022
image

ఎన్నికలకు ముందు.. తర్వాత బెంగాల్‌లో ఏం జరిగింది ?
బీజేపీ నాయకులపై దాడులు జరిగాయి. ఎక్కడికి వెళ్లినా రాళ్లతో దాడులు చేశారు. ఆ పార్టీ నేతలపై హత్యలు జరిగాయి. హత్యాయత్నాలు జరిగాయి. ఆత్మహత్యలూ జరిగాయి. వాటిపై బీజేపీ నేతల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పెద్ద పెద్ద నేతలు పరామర్శలు వచ్చారు. బెంగాల్ సర్కార్‌పై ఆరాచక ముద్ర పడింది. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత కూడా అది కొనసాగుతోంది. ఓ బిర్బూమ్ ఘటన తర్వాత బీజేపీ కార్యకర్తల ఆత్మహత్య ఘటన కూడా చోటు చేసుకుంది. వీటిపై సీబీఐ విచారణలు కూడా జరుగుతున్నాయి. అదంతా నిరంతర ప్రక్రియ అన్నట్లుగా సాగుతోంది.

తెలంగాణలో ఏం జరుగుతోంది?
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై దాడి జరిగింది. ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. దానిపై చెలరేగిన ఉద్రిక్త వాతావరణ అంతా ఇంతా కాదు. నేరుగా అమిత్ షా నే ఆ కుటుంబానికి ఫోన్ చేశారు. ఇక రామాయంపేటలో తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. వారు బీజేపీనో కాదో కానీ ఆ కలర్ మాత్రం అద్దేశారు. బీజేపీ నాయకులపై విస్తృతంగా దాడులు జరుగుతున్నాయన్న అభిప్రాయం బలపడేలా చేస్తున్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఓ కేంద్రమంత్రి బాధితులను పరామర్శించడానికి కూడా వచ్చారు.

బెంగాల్‌లో ఏం జరిగిందో.. తెలంగాణ లో ఏం జరుగుతుందో పరిశీలిస్తే..బెంగాల్‌లా మారుతున్న తెలంగాణ అని ఉదాహరణలు చెప్పాల్సిన పని లేదు. అచ్చంగా అక్కడి ఉద్రిక్తల రాజకీయమే ఇక్కడా ప్రారంభమైందిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాదిలో తాము అధికారంలోకి వచ్చే రెండో రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ నమ్ముతోంది. అమిత్ షా ప్రత్యేకంగా వ్యూహాలు సిద్ధం చేసి మరీ తెలంగాణలో రాజకీయాలను నడిపిస్తున్నారని అంటున్నారు.

ప్రత్యక్షంగా రంగంలోకి అమిత్ షా !

తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరుగుతూండటంతో అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర సర్కార్, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఖమ్మం లో ఆత్మహత్యకు పాల్పడిన సాయిగణేశ్‌ కుటుంబీకులను షా ఫోన్‌లో పరామర్శించారు. ఖమ్మంలో నిర్వహించే గణేశ్‌ సంతాప సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు ఆత్మహత్య ల ఘటనలపై నిజానిజాలను తెలుసుకునేందుకు అమిత్‌షా ఖమ్మం, రామాయంపేటలకు లీగల్‌సెల్‌ బృందాలను పంపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, వారికి మద్దతుగా పోలీసులు.. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హోంమంత్రికి బీజేపీ నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కారణంగా అమిత్‌ షా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

గవర్నర్ విషయంలోనూ బెంగాల్ తరహా ఉద్రిక్తతలు !

బెంగాల్‌లో గవర్నర్ ఎలాంటి రాజకీయాలు చేస్తారో రోజూ చూస్తూనే ఉన్నారు . ఇప్పుడు తెలంగాణలో గవర్నర్ తమిళిశై కూడా అలాంటివే చేస్తున్నారు. బీజేపీ నియమించిన గవర్నర్ తమిళిశైతోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే చాన్స్ కూడా ఉందంటున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడి గవర్నర్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వాలతో తలపడుతూ ఉంటారు. బెంగాల్, తమిళనాడుల్లో అదే జరుగుతోంది. కేసీఆర్ తీరు వల్ల చాన్స్ వచ్చిందని .. బీజేపీ గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందుకే బెంగాగాల్లో తరహా పరిస్థితులు ఇక్కడా కనిపిస్తున్నాయి.

త‌్వరలో దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి !

బెంగాల్‌లో దర్యాప్తు సంస్థల రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేసులున్న ప్రతి ఒక్కరిని బీజేపీలో చేర్పించేదాకా అవి ఊరుకోలేదు. ఇప్పుడు తెలంగాణకు కేంద్ర దర్యాప్తు బృందాలు వచ్చేశాయని.. ఇక దాడులు చేయబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దాడులు చేసే వరకూ ఈ విషయంపై స్పష్టత ఉండదు. నేరుగా టీఆర్ఎస్‌ను కానీ ఆ పార్టీ నేతల్ని కానీ టార్గెట్ చేయరని.. కేవలం వారికి ఆర్థిక ఆయువు పట్టుగా ఉన్న మార్గాలపైనే దృష్టి పెడతారని చెబుతున్నారు. దీని వల్ల టీఆర్ఎస్ నేతలు కూడా కిక్కురుమనే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. బీజేపీ రాజకీయంలో దర్యాప్తు సంస్థలది ప్రత్యేకమైన పాత్ర. అందుకే వాటిని బీజేపీ మిత్రపక్షాలని కాంగ్రెస్.. ఇతర పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి. అయితే అవి వేధింపులా కాదా అన్న విషయం పక్కన పెడితే.. రాజకీయంగా ఆయా పార్టీల వారిని చికాకు పెట్టడం ఖాయం. . టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండి… కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో సబ్ కాంట్రాక్టులు చేస్తున్న కంపెనీలపై ఇప్పటికే దాడులు జరిగాయి.

క్లారిటీ ఉంది కాబట్టే కేసీఆర్ రంగంలోకి దిగారా ?

బీజేపీ ఇక బెంగాల్‌లాగా తెలంగాణను మార్చి రాజకీయంగా పట్టు సాధించాలనుకుంటోందన్న విషయంపై కేసీఆర్‌కు క్లారిటీఉందని.. ఇంత దాకా వచ్చాకా బీజేపీ వెనక్కి తగ్గదన్న ఉద్దేశంతోనే ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారని అంటున్నారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే.. బెంగాల్ సీన్లనీ తెలంగాణలో రిపీటవడం ఖాయమని అనుకోవచ్చు.