జనం ఆదరిస్తే చాలు.. అదిరిపోయే టైటిల్స్ దేనికో!
ఆయనలేడు నువ్వొచ్చేయొచ్చు అన్న టైటిల్ పెడితే ఎలా ఉంటుంది. పోనీ లేస్తే తంతా, కూర్చుంటే చంపుతా… బావుంటుందా. మైండ్ చెడినోడు కూడా పెట్టడు కదూ. రాజకీయపార్టీ జనంలోకి వెళ్లేందుకు వారిని చైతన్యపరిచేందుకు చేపట్టే కార్యక్రమం కూడా అలా ఉండకూడదు. ప్రజలు తమకోసమేనని భావించేలా వారు స్వచ్ఛందంగా కదిలివచ్చేలా ప్లానింగ్ ఉండాలి. దానికి తగ్గ పేర్లు పెట్టుకోవాలి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు తన కార్యక్రమాలకు పెడుతున్న పేర్లు వింతగా విచిత్రంగా ఉంటున్నాయి.
మొన్నటిదాకా బాదుడే బాదుడు. ప్రభుత్వం బాదేస్తోందని బలంగా చెప్పేందుకు ఈ స్ట్రాంగ్ టైటిల్ పెట్టినా చివరికి బాబుగారు బాదేశారని సెటైర్లు పడుతున్నాయి. టీవీల్లో చంద్రబాబు బాదుడే బాదుడు అన్న హెడ్‌లైన్స్ వింటుంటే ఆయనే చావగొట్టి చెవులు మూస్తున్నాడనే అర్ధం ధ్వనించింది. బాదిబాది చావబాది కర్నూలులో చెవులు మూశాక ఇప్పుడు మరో కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు విపక్షనేత. దాని పేరేంటో తెలుసా ఇదేం ఖర్మ… ఖర్మ ఖర్మ అంటూ కార్యకర్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు.
మూడున్నరేళ్లలో ఏపీలో ఎంతో విధ్వంసం జరిగిందంటున్నారు చంద్రబాబు. జనమంతా ఖర్మ ఖర్మ అనుకుంటున్నారని తన కొత్త కార్యక్రమానికి ఇదేం ఖర్మ అనే నామకరణం చేశారు. నాయకులు ఇదేం ఖర్మ అనుకుంటూ రోడ్డెక్కాలా. కార్యకర్తలు ఖర్మ ఖర్మ అంటూ బ్యానర్లు కట్టాలా? రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో వింటానికి, చూట్టానికి ఎంత బావుంది. జనానికి ఎంత బాగా కనెక్ట్ అవుతోంది. మన ఉక్రోషం, ఆక్రోశం కార్యక్రమం పేరులోనే కనిపించాలన్న తాపత్రయంతోనే బాదుడు బాదుడు, ఇదేంఖర్మ. రేపు భరించలేం నాయనా, నువ్వొద్దేవద్దు లాంటి కార్యక్రమాలు ఉంటాయేమో! చాదస్తంకాకపోతే ఏం టైటిల్స్ ఇవి?