ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌.. అన్నీ చ‌చ్చులూ పుచ్చులేనా?

By KTV Telugu On 21 November, 2022
image

మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డితో క‌మ‌లానికి ఒరిగేదేముంది?

తెలంగాణ‌లో క‌మ‌లంపార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతోంది. టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని ఫాంహౌస్ స్టింగ్ ఆప‌రేష‌న్‌తో క‌థ అడ్డం తిర‌గ‌టంతో బీజేపీ వ్యూహం మార్చింది. ఇప్ప‌ట్లో టీఆర్ఎస్ నుంచి చెప్పుకోద‌గ్గ నేత‌లెవ‌రూ వ‌చ్చేలా లేరు. చీమ చిటుక్కుమ‌న్నా కేసీఆర్‌కి తెలిసిపోయేలా ఉంది. అందుకే కాంగ్రెస్‌నుంచి కాస్త ఫేస్ వాల్యూ ఉన్న లీడ‌ర్ల‌కి కండువా క‌ప్పేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డిని లాగేస్తున్నామ‌ని సంబ‌ర‌ప‌డుతోంది.
మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి మూడు ద‌శాబ్ధాలుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. కానీ ఆయ‌న‌కంటూ ఇప్ప‌టిదాకా ప్ర‌త్యేక గుర్తింపేమీ లేదు. యూపీఏ హ‌యాంలో కేబినెట్ హోదాలో ఓ నామినేటెడ్ పోస్టు పొంద‌డం త‌ప్ప ఆయ‌న రాజ‌కీయ జీవితంలో చెప్పుకోద‌గ్గ సంచ‌ల‌నాలేమీ లేవు. మాజీ ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి వార‌సుడిగానే ఆయ‌న ఎక్కువ‌మందికి ప‌రిచితం. కానీ తండ్రి దూకుడుగానీ, ఆయ‌న రాజ‌కీయ చాణక్యంగానీ శ‌శిధ‌ర్‌రెడ్డికి వంట‌బ‌ట్ట‌లేదు.

ఇక ఈ వ‌య‌సులో ఆయ‌న వంట‌బ‌ట్టించుకునే అవ‌కాశం కూడా లేదు. రాజ‌కీయంగా బావుకున్న‌దేమీ లేక‌పోయినా ఇప్ప‌టిదాకా ప‌క్క‌చూపులు చూడ‌లేద‌న్న మంచిపేరుంది మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డికి. కర‌డుగ‌ట్టిన కాంగ్రెస్‌వాదిగానే ఇన్నేళ్లూ ఉంటూవ‌చ్చారు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి కాంగ్రెస్ వాస‌న వ‌ద్ద‌నుకున్నా, కాషాయకండువా క‌ప్పుకున్నా రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఒరిగేదేమీ ఉండ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఏనాడూ తండ్రికి త‌గ్గ నాయ‌కుడు కాలేక‌పోయారు శ‌శిధ‌ర్‌రెడ్డి. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ కంటే త‌క్కువ ఓట్ల‌తో మూడో ప్లేస్‌కి ప‌రిమిత‌మ‌య్యారు.
ఆయ‌నున్నారో లేదో కేడ‌ర్ ప‌ట్టించుకోవ‌డం మానేశారు. రాజ‌కీయంగా ఉనికి కోల్పోయిన నాయ‌కుడిని చేర్చుకుని బీజేపీ లాభ‌ప‌డేదేముంటుందో! గుంపులో గోవింద అంతే!