బీజేపీ కీలక నాయకుడే టార్గెట్‌

By KTV Telugu On 21 November, 2022
image

తీగ లాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
బి.ఎల్‌. సంతోష్‌కు సిట్‌ నోటీసులు

తెలంగాణలో ఉప్పు నిప్పులా ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంది. రాను రాను పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసు ద్వారా బీజేపీని బజారుకు లాగడానికి ఆయన అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
తమల పాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంట అన్నట్లుగా ఉంది తెలంగాణలో రాజకీయ పార్టీల తీరు. ముఖ్యంగా బీజేపీ…టీఆర్‌ఎస్‌ మధ్య వార్‌ మొదలైంది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు కేసీఆర్‌. అందుకే ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు అడిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఇంకా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని బయటకు లాగడానికి దర్యాప్తు బృందం సిద్ధమైంది. అందులో భాగంగానే భారతీయజనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు 41ఏ నోటీసులు జారిచేసింది సిట్‌.

21వ తేదీన తమ విచారణకు హాజరు కావాలని లేకుంటే అరెస్టు చేస్తాం అని కూడా హెచ్చరించింది. సంతోష్‌ వినియోగించిన మొబైల్ నెంబరును పేర్కొంటూ ఆ మొబైల్‌ ఫోన్‌ అందులో వాడిన సిమ్ కార్డును కూడా విచారణకు వచ్చేటప్పుడు తీసుకురావాలని పోలీసులు సూచించారు. మొబైల్ఫోను మార్చేసే అవకాశం లేకుండా దాని IMEI నెంబరును కూడా పోలీసులే చెప్పారు. ఆ ఫలానా నెంబరు ఉన్న ఫోనునే తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ అనే ఈయన చాలామందికి అంతగా తెలియదు. ఇతర నాయకుల్లాగా అంత పాపులారీటీ ఉన్న వ్యక్తి కూడా కాదు. కానీ పార్టీ వ్యవహారాల్లో మాత్రం చాలా కీలకంగా వ్యవహరిస్తారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని అంటున్న రామచంద్రభారతి తో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జరిపిన సంభాషణలో సంతోష్ పేరు ప్రస్తావనకు వచ్చింది. బీజేపీలో సంతోష్ స్థాయి ఏంటనేది కూడా
ఆ ఫోన్‌ సంభాషణల్లో వినిపించింది. పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ ఇద్దరూ సంతోష్ ఇంటికి వచ్చి మంతనాలు జరిపి నిర్ణయాలు తీసుకుంటారంటూ రామచంద్రభారతి చెప్పిన ఫోన్ కాల్ ఆడియోలో ఉంది.

నంబర్‌ వన్‌ అంటే బహుశా మోడీ, నంబర్‌ టూ అంటే అమిత్ షాలు అని టీఆర్‌ఎస్‌ నేతల అభిప్రాయం. బీజేపీలో కీలకంగా ఉన్న బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడం ద్వారా ఈ కేసులో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని సిట్ స్పష్టం చేసింది. అయితే బిజెపికి ఆయువుపట్టు వంటి నాయకుడికి నోటీసులు ఇవ్వడాన్ని ఆ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చికాకు పెట్టడానికి చంద్రబాబు కూడా తనవంతు ప్రయత్నం చేశారు. ఓటుకునోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. స్టేఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తున్న వీడియోలు, ఆయనతో చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అంటూ మాట్లాడిన ఆడియే టేపులు కూడా లభించాయి. అయితే ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. రాత్రికి రాత్రే చంద్రబాబు హైదరాబాద్‌ విడిచి విజయవాడకు మకాం మార్చడంతో, చంద్రబాబు నుంచి తనకేమీ ముప్పులేదని భావించిన కేసీఆర్ ఆ కేసును అంతగా పట్టించుకోలేదు. అయితే ఈసారి మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టేలా లేరు. కేంద్రంలోని బిజెపి పరువు తీయడానికి బ్రహ్మాస్త్రంలా వాడబోతున్నారు.