ఇదేం ఖర్మరా బాబు.. జగన్ ఎదురుదాడి.!

By KTV Telugu On 22 November, 2022
image

నరసాపురం పర్యటనలో జగన్ హాట్ కామెంట్స్
చంద్రబాబు, పవన్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు
ఇదేం ఖర్మరా టైటిల్‌తో ఆటాడుకున్న జగన్

ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలు తిరిగి ఆయనపైనే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. బాబు పెట్టుకున్న వ్యూహకర్త ఇస్తున్న సలహాలో లేక సొంతంగా పెట్టుకున్న టైటిల్సో గానీ వాటితోనే వైసీపీ తిప్పికొడుతోంది. రాష్ట్రంలో బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబును వైసీపీ ఎడాపెడా బాదేస్తోంది. చంద్రబాబును ప్రజలు గత ఎన్నికల్లోనే బాదారని వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి బాది ఇంటికి పంపిస్తారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ మరో కార్యక్రమంతో డిసెంబర్ 1 నుంచి ప్రజల్లోకి వెళ్తుండేందుకు సిద్ధమవుతుండగా వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్ చంద్రబాబు టార్గెట్‌గా ఇదేం ఖర్మరా బాబూ అంటూ రఫ్పాడించారు.

గత పాలకులు ఎవరూ చేయనివిధంగా, ఊహకందని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్న జగన్ చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. కుప్పం నుంచి బాబు కర్నూలు పర్యటన వరకు జరిగిన సంఘటనల్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం ప్రజలకు ఏ మంచి చేయని బాబు, ఓటమి భయంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్ దెప్పిపొడిచారు. అదేసమయంలో పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. టీడీపీని బాబు తెలుగు బూతుల పార్టీగా మార్చేశారన దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చేశారని డైలాగులు పేల్చారు. రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019లో చంద్రబాబు సొంతపుత్రుడిని, దత్తపుత్రుడిని అన్ని చోట్లా ఓడించారని కుప్పంలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టీడీపీని చిత్తుగా ఓడించి బైబై చెప్పారని జగన్ సెటైర్లు పేల్చారు. అందుకే బాబు ఇదేం ఖర్మరా అని తలపట్టుకున్నారని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా తన ఇంట్లో క్యాబినెట్లో స్థానమిచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అనుకొని ఉంటారని జగన్ విమర్శలు గుప్పించారు.

ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఆగ్రహాంతో చేసే వ్యాఖ్యలు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారుతున్నాయి. విశాఖ ఘటన సమయంలో వైసీపీ నేతలకు జనసేనాని చెప్పులు చూపించడం, ఆ తర్వాత బాబుతో భేటీ కావడాన్ని జగన్ సైన్యం తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేసింది. ఇక కర్నూలు పర్యటనలో తనను గెలిపించకపోతే ఇదే తన చివరి ఎన్నిక అంటూ చేసిన కామెంట్స్‌తో వైసీపీకి దొరికిపోయారు చంద్రబాబు. బాబు బైబై అంటూ అధికార పార్టీ ఆటమొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవననే భయం బాబులో కనిపిస్తోందని అందుకే అధికార భగ్న ప్రేమికుడు ప్రజలను కూడా బెదిరిస్తున్నాడని జగన్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. అదేసమయంలో ఎప్పటిలాగే మరోసారి దుష్టచతుష్టయం ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు తనకు సంబంధించిన పత్రికలు, టీవీలను అడ్డం పెట్టుకొని దోచుకో…పంచుకో.. తినుకో కార్యక్రమం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అందుకే వాళ్లు బాబు గురించి ఏమీ రాయరు, చూపరని ఇక ప్రశ్నిస్తానని చెప్పే వ్యక్తి కూడా ఇలాంటివాటిని ప్రశ్నించరంటూ పవన్‌పై ఫైర్ అయ్యారు. ఇవన్నీ చూసినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదేం ఖర్మరా బాబు అనిపిస్తోందంటూ ముగించారు.