ఫాంహౌస్‌ కేసుకి కౌంటర్‌ ఎటాక్‌ మొదలైనట్లే!

By KTV Telugu On 23 November, 2022
image

సీబీఐకి అడ్డేస్తే అమ్ములపొదిలో అస్త్రాలకు కొదవా?!
సీబీఐకి తలుపేశారు.. ఈడీ, ఐటీని ఎలా ఆపుతారు?

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌. అధికారపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు. బీజేపీకి బాగా దగ్గరైన ముగ్గురు మధ్యవర్తుల అరెస్ట్‌. మొన్నటిదాకా బీజేపీ జుట్టుని టీఆర్‌ఎస్‌ గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు కేంద్రం మార్క్‌ రివెంజ్‌ మొదలైంది. ఫాంహౌస్‌ ప్రలోభాల కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంఘ్‌లో ప్రముఖుడైన బీఎల్‌ సంతోష్‌కుమార్‌కి సిట్‌ నోటీసులిచ్చిన సమయంలోనే హైదరాబాద్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఈమధ్యే టీఆర్‌ఎస్‌ ఎంపీ రవిచంద్ర, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాపార వ్యవహారాలపై ఐటీతో పాటు ఈడీ కన్నేసింది. గంటల తరబడి సోదాలు జరిగాయి. కొన్ని కీలక ఆధారాలు దొరికాయి. పనామా లీక్స్‌తో సంబంధమున్న వ్యక్తితోనే గంగుల బిజినెస్ డీల్‌ నడిపినట్లు ఈడీ తేల్చింది. ఆ దాడుల కథ కొలిక్కిరాకముందే మరో మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా ఆదాయపుపన్నుశాఖ రంగంలోకి దిగింది. మంత్రితో పాటు ఆయన బంధువుల, సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరిపి భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. ఆయన ఆదాయం లెక్క తేలుస్తోంది.
మునుగోడుతో టీఆర్‌ఎస్‌ని మరో దెబ్బకొట్టాలనుకుంది బీజేపీ. కానీ గట్టిపోటీ ఇచ్చినా ఆ సీటు చివరికి టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. దీంతో గులాబీపార్టీ ఫాంహౌస్‌ కేసుపై ఇంకాస్త పట్టుబిగించింది. కేంద్రంనుంచి ప్రతీకార చర్యలు తప్పవని ముందే ఊహించి సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది.

రాష్ట్రం గేటేసిందని కేంద్రం దూకకుండా ఉంటుందా? అదే జరుగుతోంది. ఈడీ, ఐటీ టీఆర్‌ఎస్ పెద్దలమీద దృష్టిపెట్టాయి. పక్కా ఆధారాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఐటీ చేతులూపుకుంటూ వెళ్లిపోలేదు. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో 4కోట్ల దాకా నగదు స్వాధీనం చేసుకుంది. యూనివర్సిటీతో కలిపి మల్లారెడ్డికి 38 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. రెండు మెడికల్ కాలేజీలు, ఆరుదాకా స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములున్నాయని అంటున్నారు. మెడికల్ కాలేజ్ సీట్లపై వచ్చిన ఆరోపణలపైనా ఐటీ కూపీ లాగుతోంది. మల్లారెడ్డి రేంజ్‌లో కాకపోయినా టీఆర్‌ఎస్‌లో కోట్లకు పడగెత్తిన నేతలు చాలామందున్నారు. ఐటీ కొరడా తమదాకా వస్తుందేమోనని అందరిలో దడ మొదలైంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని పైకి అంటున్నా లోతుగా వెళ్తే లొసుగులు బయటపడతాయన్న భయంతో కొందరికి నిద్రపట్టటంలేదు. ఫాంహౌస్‌ వ్యవహారం మా కొంపమీదికి తెచ్చిందని ఎవరికివారు సణుక్కుంటున్నారు.