చరిత్ర..చెరిపేస్తే చెదిరిపోదు..చింపేస్తే చిరిగిపోదు!

By KTV Telugu On 23 November, 2022
image

చరిత్రను తవ్వుదాం.. వివాదాలు కెలుకుదాం!
తాతల ‘స్వతంత్రపోరాటం’.. మనవళ్ల ఆత్మరక్షణ!

దేశంలో నేతలకు ఇప్పుడు చరిత్రను తవ్వడం ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. తాము పుట్టకముందు జరిగిన స్వతంత్రపోరాటానికి ఎవరికితోచిన భాష్యం వాళ్లు చెప్పుకుంటూ పోతున్నారు. అలనాటి నేతల మంచిచెడ్డల గురించి గొప్పగా విశ్లేషిస్తున్నారు. చరిత్రను ఎవరికివారు తమకు అనుగుణంగా వక్రీకరిస్తున్నారు. వక్రభాష్యాలు చెబుతున్నారు. కొందరు సమర్థిస్తున్నారు. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎవరి ఎజెండాలు వారికున్నాయి కాబట్టి!
గాంధీ గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం నిరంతరం జరుగుతోంది. ఆయన్ని కాల్చిచంపిన గాడ్సేని కూడా దేశభక్తుడని పూజించే ప్రబుద్ధులు తయారయ్యారు.

ఇక ఈ దేశ తొలిప్రధాని నెహ్రూ నిర్ణయాలను ఈకాలపు నాయకగణం తప్పుపడుతోంది. ఈ కుటుంబాన్ని నిందిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చాక ఈ ధోరణి పెరిగింది. భారత్‌ జోడో అంటూ లాంగ్‌ వాక్‌ మొదలుపెట్టిన రాహుల్‌గాంధీ నేను సైతం అంటూ ఈ వివాదాల్లో గొంతు కలిపేశారు. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో దేశానికి వీర్‌ సావర్కర్‌ ద్రోహం చేశాడని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆంగ్లేయులకు సహకరించి గాంధీ, నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ లాంటి పోరాట యోధులను సావర్కర్‌ మోసగించాడని రాహుల్‌ తప్పుపట్టారు. దీంతో సావర్కర్‌ని రాహుల్‌ అవమానించారంటూ బీజేపీ భగ్గుమంటోంది. రాహుల్‌గాంధీపై సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ ఫిర్యాదు చేశారు. ఇదే మనవడు గతంలో మహాత్మాగాంధీని తాను జాతిపితగా భావించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ వ్యాఖ్యలను మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ సమర్ధిస్తున్నారు. బ్రిటిషర్ల వీర్‌ సావర్కర్‌ అవగాహన నిజమేనంటున్నారు బాపూజీ మనవడు. క్షమాపణ కోరి జైలునుంచి బయటపడ్డ సావర్కర్‌ తర్వాత వారికి సహకరించాడనేది తుషార్‌గాంధీ వాదన. చరిత్ర తిరగేస్తే సావర్కర్‌ ద్రోహానికి బోడెలన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. తాతల కాలంలో ఏం జరిగిందో, ఎవరు రైటో ఎవరు రాంగో మనవళ్లు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారన్నమాట! మరోవైపు మళ్లీ బీజేపీతో దోస్తీకోసం ప్రయత్నిస్తున్న శివసేన(థాక్రే)కి రాహుల్‌ వ్యాఖ్యలు సాకుగా దొరికాయి. రాహుల్‌ వ్యాఖ్యలను తప్పుపడుతూ యూపీఏకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉద్దవ్‌ ఉన్నారు. ఎవరి ఎజెండాలు వాళ్లవి. కానీ చరిత్రని ఎవరూ వక్రీకరించలేరు. తమకు అనుకూలంగా మార్చుకోలేరు. ఎవరి తుత్తి వాళ్లకు ఆనందం.. అంతే!