ఆ హామీలు సంగతేంటి సారూ

By KTV Telugu On 23 November, 2022
image

ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త భయం పట్టుకుందా ? రెండోసారి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలే కేసిఆర్ కు ఇప్పుడు చిక్కులు తెచ్చి పెడుతున్నాయా? సర్కారు పట్ల యువతకు వ్యతిరేకత పెరుగుతున్న వేళ గులాబీ దళపతి ఏం చేయబోతున్నారు ?

ఎటువైపు చూసినా ఎదురుగాలే.
కాషాయ దూకుడుతో కేసీఆర్ కు టెన్షన్.
గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే గుదిబండ.
అమలు కాని హామీలు కోకొల్లలు.
నిరుద్యోగ భృతి అంతంతమాత్రం.
దళితులకు ముూడెకరాల భూమి ఒట్టిమాటే.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూపు.
ఉద్యోగ నియామకాల్లో తీవ్ర జాప్యం.
పెరగని రైతు బంధు నిధులు.
అమలుకు నోచుకోని లక్ష రూపాయల రుణ మాఫీ.
రాష్ట్రానికి మిగిలిందీ లక్షల కోట్ల అప్పు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎటు వైపు నుంచి చూసినా ఎదురుగాలే వీస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల సంవత్సరంలో ప్రత్యర్థులు ఆయన్ను అన్ని వైపుల నుంచి ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు 2018లో ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. దానితో అన్ని అంశాలు సగటు ఓటర్లకు తెలిసిపోయి ఎన్నికల ప్రచారంలో నిలదీస్తారన్న భయం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో రోజురోజుకు పెరిగిపోతోంది.

2018లో టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకారం ఆసరా పెన్షన్లను వెయ్యి నుంచి 2 వేల 116 రూపాయలకు పెంచాలి. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 57కు తగ్గించాలి. దివ్యాంగులకు నెలకు మూడు వేల నూట పదహారు రూపాయలు, వృద్ధులు, వితంతువులకు నెలకు రెండు వేల నూట 16 రుపాయల చొప్పున అందిస్తున్నట్లు ప్రభుత్వం అంటోంది. ఈ పెన్షన్లు అందుకునే వారి సంఖ్య యాభై లక్షలు దాటిందని కూడా చెప్పుకుంటోంది. అయితే తమకు పెన్షన్లు అందడం లేదని లక్షల మంది చెబుతున్నారు.

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఒక మిథ్యగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లోనే డబుల్ బెడ్ రూములు కనిపిస్తాయి. రాష్ట్రంలో లక్షన్నర డబుల్ బెడ్ రూము ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం కేవలం సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాటిని నిర్మించింది. మిగతా చోట్ల పనులు ప్రారంభించి వదిలేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వక పోవడంతో పనులు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. సొంత స్థలం ఉండి ఇళ్లుకట్టుకునే వారికి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల సాయం ప్రకటనలకే పరిమితమైంది.

లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధైర్యంగా బ్యాంకుల దగ్గర అప్పులుతీసుకున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు వారి ఖాతాలను నిలుపుదల చేశాయి. ఇలా 31 లక్షల మంది రైతులు కొత్త రుణాలు తీసుకోలేని దుస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ లెక్కలు చెబుతోంది. రుణమాఫీ కోసం 20 వేల కోట్లు కేటాయిస్తే రెండు వేల కోట్లు కూడా విడుదల చేయలేదని విపక్షాలు అంటున్నాయి. పైగా ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధులను కూడా బ్యాంకులు తమకు చెల్లించాల్సిన రుణం కింద జమకట్టుకున్నాయి. చేనేత కార్మికులకు కేసీఆర్ చేసిందేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బతుకమ్మ చీరలు నేసిన వారికి సకాలంలో డబ్బులివ్వరు. చేనేత కస్టర్లు ఏర్పాటు చేయడంలో జాప్యం వహిస్తున్నారు. పనులు చేసుకునేందుకు వారికి ఆర్థిక సాయం అందడం లేదు. దళిత బంధు అమలు ఆగిపోయింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారు. ఒకటి రెండు చోట్ల ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దానితో పేద దళితులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రభుత్వోద్యోగాలకు రిటైర్మెంట్ వయసు పెంచాతామన్న హామీని నెరవేర్చుతూ 61 సంవత్సరాలకు పెంచారు. దానితో తమకు ఉద్యోగాలు ఎలా వస్తాయని నిరుద్యోగ యువత ఆందోళన చెందింది. ఇంకేముందు 90 వేల నుంచి లక్ష ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు 30 వేల పోస్టులకే నోటిఫికేషన్ విడుదలైంది. మిగతావి ఎప్పుడు చేస్తారో తెలీదు. రాష్ట్రంలోని నలభై లక్షల మంది నిరుద్యోగుల్లో మెజార్టీ వర్గానికి నిరుద్యోగ భృతి అంతంతమాత్రంగానే అందుతోంది. దానితో కేసీఆర్ ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహం చెందుతోంది.

పారిశ్రామిక ప్రగతి ప్రధాన నగరాలకే పరిమితమైంది. దానితో జిల్లాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దీనిపైనా ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఇక కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత తక్కువలో తక్కువ నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని లెక్కతేలింది. అదీ తెలంగాణ పరిస్థితి.