అంతన్నారు… ఇంతన్నారు… ఇంకేముంది వచ్చేశాడన్నారు.. ఇక జయం మనదేరా అని కూడా చెప్పుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో క్యాష్ బాక్సులు వదిలిపెట్టేస్తాడన్నారు. తమతోనే ఉంటూ తమనే గెలిపిస్తాడన్నారు. అదీ తమలో చేరిపోయి మరీ విజయ తీరాలకు చేరుస్తాడన్నారు. వారం తిరక్కుండానే సీన్ సితారైంది. రూట్ మారింది. తేలిందేమిటంటే.. ఆయన రానన్నాడు. బయట నుంచి మద్దతు ఇస్తానంటున్నాడు. అంటే వ్యూహకర్తగా మాత్రమే కొనసాగుతానంటున్నాడు.. అదీ ప్రస్తుతానికి కాంగ్రెస్ మీట్స్ ప్రశాంత్ కిషోర్ కథ…
వారం రోజుల నిరీక్షణ తుస్సుమంది. ఆ దిశగా చేసిన విశ్లేషణలన్నీ వేస్టయ్యాయి. ఐ-ప్యాక్ ని ప్యాకప్ చేసి ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ లో చేరతాడనుకున్న వారికి నిరాశే ఎదురైంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ ప్రజెంటేషన్ ఇచ్చాడు. సోనియా సహా కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ వర్గానికి అది తెగ నచ్చేసింది. ఇంకేముంది మళ్లీ ఢిల్లీని ఏలెస్తామని కలలు కనడం మొదలెట్టారు. పీకే కాంగ్రెస్ లో చేరితే పార్టీలో అందరం కలిసి మరింత సమర్థవంతంగా పనిచేయగలమని సూచించారు. ఆలోచించి చెబుతానని పీకే సమాధానం ఇవ్వడంతో వారికి ఆశలు చిగురించాయి. అంతలోనే పీకే పెద్ద బాంబు పేల్చాడు..
పీకే రావట్లేదోచ్ అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్వయంగా ఆ అంశాన్ని ట్వీట్ చేశారు. పీకే ఆలోచనా విధానాన్ని గౌరవిస్తూ ఆయన సలహాలు పొందుతామన్నారు. సుర్జేవాలా ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలతో తన వంతుగా పీకే కూడా ఒక పవర్ ఫుల్ ట్వీట్ చేశాడు. కాంగ్రెస్ అధిష్టానం ఉదారంగా చేసిన ఒక ఆఫర్ ను స్వీకరించలేకపోతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి తనకంటే కూడా మంచి నాయకత్వం, సమష్టి ప్రయత్నాలు అవసరమన్నాడు. సంస్థాగతమైన సమస్యలను సంస్కరణలతో అధిగమించాలని కాంగ్రెస్ అధిష్టానానికి పీకే సూచించాడు. కాంగ్రెస్ పార్టీలో చేరదలచుకోలేదంటూనే ఆ పార్టీ మూలాల నుంచి పునర్నిర్మాణం జరగాలన్నాడు. సలహాదారుగా వ్యవహరించేందుకు ఎలాంటి అభ్యంతరం లేనట్లుగా సంకేతాలిచ్చాడు..
సీనియర్ల ఆనందహేల
పీకే రాకను కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందులో జీ-23 నేతలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఇంత టాలెంట్ ఉంటే, మళ్లీ పీకే రావాలా అని సోనియాగాంధీని నిలదీసినట్లు సమాచారం. పీకే కాంగ్రెస్ పార్టీలో చేరితే.. మిగతా పార్టీలకు వ్యూహకర్తగా పనిచేయడం మానేస్తాడా అని ప్రశ్నించారు. అతనొస్తే మేము ఉండము అన్నట్లుగా మాట్లాడారు. దానితో పీకే పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ చీలికలు పేలికల పార్టీలో చేరే కంటే దూరంగానూ, ప్రశాంతంగానూ ఉండటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. దానితో ఇప్పుడు పీకే ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సీనియర్లు సంబరాలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇది సోనియా కుటుంబంపై తాము సాధించిన విజయమని కూడా వాళ్లు చెప్పుకుంటున్నారట..
విచిత్ర బంధం
కాంగ్రెస్, పీకేది విచిత్రబంధం. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశాడు. అంటే ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం పనిచేశాడన్నమాట. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీని కలిపి యూపీ కే లడ్కే అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చినా ప్రయోజనం కనిపించలేదు. తలబొప్పి కట్టిపోయిన ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీని బాగు చేయడం నా వల్ల కాదురా దేవుడా అని లెంపలేసుకున్నాడు. బిహార్లో లాలూ, నితీష్ ని గెలిపించగలిగినా.. యూపీలో కాంగ్రెస్ విజయం అసాధ్యమని గుర్తించాడు. అయితే పీకే పేరాశకు పోయాడని వాదించే వాళ్లూ ఉన్నారు. గుజరాత్ లో మోదీని, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించినప్పటికీ, కాంగ్రెస్ ను నడిపించడం అంత సులభం కాదని గ్రహించాడు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పట్ల కూడా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయినా వ్యూహకర్తగా పనిచేసేందుకు ఎందుకు అంగీకరించాడో 2024 ఎన్నికల ఫలితాలు మాత్రమే చెబుతాయి..
రాజకీయాల్లో తప్పటడుగులు
పీకే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకోవడం ఇది మొదటిసారి కాదు.. గతంలో ఆయన నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరాడు. 2018 ద్వితీయార్థం నుంచి 2020 ప్రథమార్థం వరకు జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఎన్నికల వ్యూహకర్తగా ఇచ్చే సలహాలు … పార్టీ అధినేతతో ప్రవర్తించాల్సిన తీరు .. రెండూ వేర్వేరు ట్రాకులని గుర్తించలేకపోయాడు. ఉమ్మడి పౌర స్మృతిపై నితీశ్ తో విభేదించడంతో పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుని వెనక్కి తగ్గాడు. మరో సారి ఇలాంటి ప్రయోగం చేస్తాడో లేదో చూడాలి.