తమిళనాడుకు శ్రీలంక వలసపోటు

By KTV Telugu On 27 April, 2022
image

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తమిళనాడుకు ఇబ్బందిగా పరిణమించింది. శ్రీలంక తమిళులు ఒక్కక్కరుగా తమిళనాడు భూభాగంపై అడుగు పెట్టడంతో స్టాలిన్ సర్కారుకు పరిపాలనాపరమైన, సామాజికపరమైన సమస్యలు తప్పవనిపిస్తోంది. వాటిని పరిష్కరించేందుకు తమిళనాడు సర్కారు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తోంది.

శ్రీలంక సంక్షోభంతో ఆ దేశంలో మధ్యతరగతి, పేద ప్రజానీకం నానా తంటాలు పడుతోంది. పెట్రోల్ రూ. 350, చక్కెర రూ. 300కు విక్రయిస్తండటంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. భవిష్యత్తుపై భరోసా లేక జనం దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా కాలం వెళ్లదీస్తున్నారు.. సిన్హల జాతీయుల పరిస్థితి ఎలా ఉన్నా… శ్రీలంక తమిళులు మాత్రం నిలువ నీడ కోసం, ఉపాధి అవకాశాల కోసం స్వదేశం వైపు చూస్తున్నారు.

20 మైళ్ల ప్రయాణానికి రూ. 18, 000

శ్రీలంక తమిళులు ఇప్పుడు పదుల సంఖ్యలో మాత్రమే తమిళనాడుకు వస్తున్నారు. తర్వాత భారీ సంఖ్యలో కూడా రావచ్చు. లంకలో తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతమైన జాఫ్నా ద్వీపకల్పం నుంచి తమిళనాడులోని ధనుష్కోడి వచ్చేందుకు 20 నాటికల్ మైల్స్ ప్రయాణించాల్సి ఉంటుంది. మర పడవల్లో తీసుకొచ్చి వదిలేసేందుకు వారి నుంచి 18 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. చీకటి మాటున తీసుకొచ్చి… సముద్ర తీరానికి కొంచెం దూరంలో దించేసి వెళ్లిపోతారు. నడుచుకుంటూ తీరానికి చేరుకోగానే.. వారు ఎక్కడికి వెళ్లలేక నేరుగా మెరైన్ పోలీసుల దగ్గరకే చేరతారు. వారిని ప్రభుత్వం ప్రస్తుతానికి కోయంబత్తూరు జిల్లాలోని ఆలందురై శరణార్థుల శిబిరానికి తరలిస్తోంది.

తమిళనాడు ప్రభుత్వానికి కష్టమే.

శ్రీలంక తమిళులను గతంలో ఆహ్వానించి.. అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లుగా ఇప్పుడు చేయలేని పరిస్థితి ఉంది. వాళ్లను దేశంలో ఉండనివ్వాలా వద్దా అనే అంశంపై తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. దానితో స్టాలిన్ ప్రభుత్వం మొదట వచ్చిన వారిని పాస్ పోర్ట్ చట్టం కింద అరెస్టు చేసి.. సెంట్రల్ జైల్లో పెట్టింది. తర్వాత క్లారిటీ కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. సెకెండ్ బ్యాచ్ నుంచి… వచ్చిన వారందరినీ శరణార్థులుగా పరిగణిస్తూ మండపం శిబిరంలో ఉంచింది. అదీ మూడు నాలుగు దశాబ్దాలుగా లంక తమిళులున్న శిబిరం. శ్రీలంక తమిళులు దాన్ని సొంతింటిలా భావిస్తారు.

రెండో సారి వస్తున్నారు.
ప్రస్తుతం శ్రీలంక నుంచి ఆగమనాల్లో రెండో సారి వస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈలం సమస్య హయ్యస్ట్ పాయింట్లో ఉన్న రోజుల్లో లక్షలాది మంది తమిళులు ప్రాణభయంతో ఇక్కడికి వచ్చేశారు. కొంతమంది ఇక్కడే పెరిగారు. శరణార్థుల కుటుంబాల్లో పెళ్లిళ్లు కూడా జరిగాయి. ఎల్టీటీఈ అంతరించిపోయిన తర్వాత వాళ్లంతా దర్జాగా శ్రీలంక వెళ్లిపోయి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. మళ్లీ తమిళనాడుకు వచ్చి చేయి చాపాలన్న ఉద్దేశం లేకపోయినా… ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో రోజు కూలీకి కూడా అవకాశం లేక, రాక తప్పడం లేదు. ఇక్కడే ఉండిపోవాలన్న ఉద్దేశం తమకు లేదని లంక తమిళులు చెబుతున్నారు. పూట గడిచే అవకాశం ఉన్నా వెళ్లిపోతామని, లంక తమ పుట్టినిల్లని వారి వివరణ. ప్రస్తుతానికైతే తమిళనాడు ప్రభుత్వం రేషన్ ఇస్తేనే కడుపు నిండుతోంది

భవిష్యత్తు ఆగమ్య గోచరమే.

లంకలో ఉండే తమిళుల్లో పేద, అల్పాదాయ వర్గాలే ఎక్కువగా ఉన్నారు. భవిష్యత్తుపై ఆశ వదులుకుని ఇండియా వచ్చామని వాళ్లు చెబుతున్నారు. భారత ప్రభుత్వం చొరవ చూపి శ్రీలంకకు మరింతగా ఆర్థిక సాయం చేస్తేనే ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందని, అప్పుడే తాము తిరిగి వెళ్లే అవకాశం వస్తుందని వారి వాదన. అప్పటి దాకా అటు ఢిల్లీ వైపు.. ఇటు కడలి వైపు చూస్తూ కాలం వెళ్లదీయడం మినహా చేయగలిగిదేమీ లేదట.