అందులో ఏం దాచావు బాబాయ్

By KTV Telugu On 24 November, 2022
image

తెలుగు నేతల వ్యక్తిగత సెల్ ఫోన్లు ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ గా మారాయి. అందులో ఎలాంటి సమాచారం నిక్షిప్తమై ఉంది. విజయసాయి రెడ్డి, మల్లా రెడ్డి ఇద్దరి ఫోన్లు అధికార పార్టీలకు అంత ముఖ్యమైనవా. వాళ్లెందుకు టెన్షన్ పడుతున్నారు. ప్రత్యర్థులు ఎందుకు ఆరోపణలు సంధిస్తున్నారు.

ఐ- ఫోన్ పోయినట్లు విజయసాయి ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి పీఏ లోకేశ్వరరావు
లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలోనే ఫోన్ మాయం
విజయసాయి ఫోన్ ను జగన్ లాక్కున్నారని టీడీపీ ఆరోపణలు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ స్వాధీనం
సిబ్బంది క్వార్టర్స్ లో దొరికిన మల్లారెడ్డి ఫోన్
ఫోన్లలో కీలక సమాచారం ఉందన్న అనుమానాలు
విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నమా ?
మల్లారెడ్డి ఆర్థిక లావాదేవీలన్నీ ఫోన్ ద్వారానే జరుగుతాయా ?

రెండు రోజుల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు సెల్ ఫోన్లపై చర్చ జరుగుతోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి ఫోన్ పోయినట్లు తాడెపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. మాజీ జర్నలిస్టు, విజయసాయిరెడ్డి పీఏ అయిన పీ.లోకేశ్వరరావు స్వయంగా వెళ్లి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రొ ఈ నెల 21 నుంచి కనిపించడం లేదని లోకేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అయితే విజయసాయి రెడ్డి తాడేపల్లిలో ఎవరికీ కనిపించలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేశారో అర్ధం కావడం లేదు. ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్ లేదా విశాఖలో ఉంటారు.

కట్ చేసి చూస్తే అంతకు ఒక రోజు ముందే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఫోన్ వ్యవహారం దుమారం రేగింది. మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, విద్యా సంస్థలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 50 ఆదాయపన్ను బృందాలు దాడులు చేశారు. మొట్టమొదటగా ఆయన కంప్యూటర్, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ల కోసం వెదికాయి. అయితే ఎంతకి సెల్ ఫోన్ దొరకలేదు. ట్రేస్ చేస్తే చివరకు పనివాళ్ల క్వార్టర్స్ లో ఉన్నట్లు తెలిసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ ను పనివాళ్లు దాచి పెట్టారని ఒక వాదన వినిపిస్తుండగా, చెత్తలో పడేస్తే ఐటీ డిపార్టమెంటు వాళ్లు వెదికి పట్టుకున్నారని మరో వాదన వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, తెలంగాణలో బీజేపీ ఈ సెల్ ఫోన్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో విజయసాయి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టును గుర్తుచేస్తూ అందులో వైసీపీ ఎంపీ హ్యాండ్ కూడా ఉందని టీడీపీ అంటోంది. లిక్కర్ స్కాం విచారణ తనవైపుకు తిప్పినప్పుడు నిజాలు బయటపడకుండా సెల్ ఫోన్ దాచేశారని విజయసాయి రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ మరో మాట కూడా అంటోంది. విజయసాయిరెడ్డి తాను ఇరుక్కోవడం కాకుండా జగన్ ను ఇరికించేందుకు ప్రయత్నించారని. దానితో జగన్ ఆయన్ను పిలిపించి నాలుగు తన్నిసెల్ ఫోన్ లాక్కున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ కూడా అలాంటి ఆరోపణలే చేస్తూ మల్లారెడ్డి సెల్ ఫోన్ ను చెత్తబుట్టలో పడేశారంటే అందులో ఖచితంగా కీలక సమాచారం ఉందని వాదిస్తోంది.

అత్యాధునిక యుగంలో సెల్ ఫోన్ చాలా అవసరం. పైగా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు లావాదేవీలు, ఇంపార్టెంట్ నోట్స్ సెల్ ఫోన్లోనే నిక్షిప్తమవుతోంది. మల్లారెడ్డికి ఒక యూనివర్సిటీ, 38 ఇంజినీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఫీజులు వసూలు, దైనందిన కార్యకలాపాలకు సంబంధించిన బ్లాక్ దందా బాగానే నడుస్తోందని చెబుతారు. ఎవరికి ఎంతిచ్చారు, ఇంకా ఎంతివ్వాలి లాంటి సమాచారం సెల్ ఫోన్లో నమోదు చేసి ఉంచారని అనుమానించిన ఐటి శాఖ అధికారులు దాని కోసం ప్రత్యేకంగా వెదికారు. సెల్ ఫోన్ లో నమోదైన నెంబర్లను బట్టి కూడా ఆర్థిక లావాదేవీల కూపీ లాగే వీలుంటుంది.

వైసీపీలో విజయసాయి రెడ్డి నెంబరు టూ. ఆయన్ను ఉత్తరాంధ్ర సీఎం అని కూడా అంటారు. విజయసాయి ఆర్థిక లావాదేవీలు ఎక్కువగానే నిర్వహిస్తుంటారు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ మందితో మాట్లాడుతుంటారు. జగన్ కు అన్నీ తానై పనులు చేస్తుంటారు. అందుకే లిక్కర్ కేసు దర్యాప్తు జరిగితే ఇబ్బంది లేకుండా సెల్ ఫోన్ మాయం చేశారని చెబుతున్నారు. అయితే ఐ ఫోన్ ట్రేస్ చేయడం సలభమేనని సైబర్ నిపుణులు వాదిస్తున్నారు. ఫోన్ దొరుకుతుందో లేదో చూడాలి మరి.