కోర్టులతో గేమ్స్‌ ఆడొద్దు.. తలో లక్ష వడ్డించారు

By KTV Telugu On 24 November, 2022
image

ప్రతీదీ రాజకీయమైతే కోర్టులు ఊరుకుంటాయా!
పిటిషన్‌ వేయగానే అయిపోదు.. చానా కతుంది!

ఇప్పటం. గుంటూరుజిల్లాలోని ఈ గ్రామం మొన్నటిదాకా అందరి నోళ్లలో నానింది. అక్కడేదో విధ్వంసం జరిగిపోతుందన్న ప్రచారం భారీగా జరిగింది. కారణం..అంతకుముందు అక్కడికి దగ్గర్లోనే జనసేన మీటింగ్‌ జరగడం, ఆ తర్వాత గ్రామంలో రోడ్లవిస్తరణకోసం కూల్చివేతలు చేపట్టటం.

జనసేనకు మద్దతిచ్చినందుకు ఇళ్లు కూలుస్తారా అంటూ పవన్‌కల్యాణ్‌ పరామర్శకు బయలుదేరారు. శిధిలాల మధ్య ఆవేశంగా తిరిగారు. బాధితులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్లు కూలిస్తే మీ ఇడుపులపాయ ఎస్టేట్‌లో నేషనల్‌ హైవే వేస్తామని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం ప్రకటించారు. ఆ తర్వాత నారా లోకేష్‌ నేను సైతమంటూ ఆ ఊరిబాట పట్టారు. అప్పుడే కొన్ని ఇళ్లముందు మీ పరామర్శలు వద్దు, మీ సాయమూ మాకొద్దని బ్యానర్లు వెలిశాయి. రోడ్డు విస్తరణకోసం ఆక్రమణలు తొలగిస్తే జనసేన, టీడీపీ రాజకీయ రచ్చ చేస్తున్నాయని వైసీపీ మండిపడింది.

పవన్‌కల్యాణ్‌ మరోసారి ఇప్పటం టూర్‌ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆయన మళ్లీ ఊళ్లోకి రాకముందే ఈ గ్రామ రైతులకు హైకోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధించింది. తప్పుడు సమాచారం ఇచ్చి స్టే పొందినందుకు 14 మంది రైతులకు కోర్టు ఫైన్‌ పడింది. న్యాయబద్ధంగానే వ్యవహరించామన్న వైసీపీ వాదనకు హైకోర్టు నిర్ణయం బలం చేకూర్చింది. ఇప్పటంలో అరాచకం జరిగిపోయిందని ఇప్పటిదాకా ఆరోపణలు గుప్పించిన జనసేనాని షెడ్యూల్‌ ప్రకారం ఆ ఊరికెళ్తారా? బాధితులకు పరిహారం ఇస్తారా? కోర్టు ఫైన్లదాకా వెళ్లాక ఆయన టూర్‌కి ఇప్పటం జనం స్పందిస్తారా?