తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… బీజేపీపై పోరాటానికి శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తున్నారు. కానీ ఆయన టీం మాత్రం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. మంత్రుల్లో అత్యధికులు కేసీఆర్ చేస్తున్న పోరాటానికి అండగా ఉండటం లేదు. తమ తమ సొంత వివాదాల్లో మునిగి తేలుతున్నారు. అధికారం నెత్తికెక్కి ఇలా చేస్తున్నారని, ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఎన్నికల టీంను రెడీ చేసుకోవాల్సిందేనని, లేకపోతే మొదటికే మోసం వస్తుందన్న అంచనాలు టీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి.
వివాదాల్లో పలువురు మంత్రులు !
గత ఏడాది మేలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ఎనిమిది నెలలుగా కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గంలో స్వల్పమార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నా ఎప్పుడనేది అంతు చిక్కడం లేదు. చాలాచోట్ల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షా లకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దు బాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. గతంలో ఓ మంత్రి రాసలీలల ఆడియో బయటకు వచ్చింది. అది ప్రో టీఆర్ఎస్ మీడియాలోనే హైలెట్ అయింది. ఆ మంత్రిపై గ్రానైట్ అక్రమ రవాణా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఖమ్మం మంత్రి అజయ్ కుమార్ సంగతి చెప్పాల్సిన పని లేదు. మంత్రి మల్లారెడ్డి అసలు వివాదాల కోసమే మంత్రయ్యారా అన్నట్లుగా ఉంటారు. మరో నలుగురైదుగురు మంత్రులు పనితీరు విషయంలో ప్రజాగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు వీరందర్నీ పెట్టుకుని కేసీఆర్ ఎన్నికలకు వెళ్లడం అంటే.. వ్యూహాత్మక తప్పిదమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇమేజ్ మేకోవర్ కోసం ప్రయత్నించాల్సిందే !
రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా మూడున్నరళ్లవుతోంది. కొంత కాలం అసలు కేబినెట్ లేకుండా ఉన్నారు. తర్వాత కొంత మంది మంత్రుల్ని తీసుకున్నారు. అనేకానేక తర్జన భర్జనల తర్వాత ఈటలను కూడా కేబినెట్లోకి తీసుకున్నారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చివరికి రాజకీయాలు మారిపోయాయి. ఈటలను బర్తరఫ్ చేయాల్సి వచ్చింది. కానీ మంత్రివర్గం మొత్తం గందరగోలంగా తయారైందనేది ఎక్కువ మంది అంగీకరించే విషయం. అందుకే మొత్తంగా మార్చేయడానికి కేసీఆర్ కొన్ని సమీకరణాలు ఆలోచించి.. ఎమ్మల్సీ స్థానాలను భర్తీ చేశారు. రాజ్యసభ సభ్యునిగా బండా ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేశారు. కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. అసలు ఎగ్గొడతారని అనుకున్న కౌశిక్ రెడ్డికి కూడా చాన్సిచ్చారు. అనూహ్యంగా ఇక అవకాశం లేదనుకున్న కడియం శ్రీహరికీ అవకాశం కల్పించారు. కేబినెట్ సమీకరణాలతోనే వీరికి అవకాశం కల్పించారని టీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఈటల రాజేందర్ సామాజికవర్గానికి చెందిన ముదిరాజ్ వర్గీయుల్ని ఆకట్టుకోవడానికి బండా ప్రకాష్‌ను కేబినెట్లోకి తీసుకుని డిప్యూటీ సీఎం చేస్తారన్న ఊహాగానాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇక మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఫైనాన్స్ మినిస్టర్‌గా ఖరారరయ్యారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కేసీఆర్ ఖచ్చితంగా ఈ ఆలోచనలతోనే ఆయనను ఎమ్మెల్సీ చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ హరీష్ వద్ద ఉంది. ఆయనను వైద్య ఆరోగ్య శాఖకు పరిమితం చేసే అవకాశం ఉంది.
ఎలక్షన్ టీం ఎంత త్వరగా ఏర్పాటు చేసుకుంటే అంత మంచిది !
కేసీఆర్ ఏ క్షణమైన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుల్ని, రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గుర్ని తొలగిస్తారని చెబుతున్నారు. ఏపీ కేబినెట్లోనే సీఎంతో కలిసి రెడ్డి సామాజికవర్గ మంత్రులు ఐదుగురు ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఆరుగురు ఉన్నారు. సామాజిక సమీకరణాలనూ చూడాల్సి ఉంది. సమర్థతనూ పట్టించుకోవాల్సిఉంది. అందుకే కేసీఆర్ ఎన్నికల టీమ్‌ను ఎంత త్వరగా ఏర్పాటు చేసుకుంటే అంత మంచిదన్న వాదన వినిపిస్తోంది.