ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎం.పి రఘురామ పేరు

By KTV Telugu On 24 November, 2022
image

విచారణకు హాజరుకావాలన్న సిట్‌
41 A సిఆర్‌పీసీ కింద నోటీసులు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కేసుతో సంబంధం ఉంది అనుకున్న వారందరిపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో నిందితులైన నందకుమార్‌, రామచంద్రభారతి, సింహయాజి ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట విచారణకు హాజరు కాగా మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు. దాంతో వారిపై సిట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. బి.ఎల్‌. సంతోష్‌ కు మరోసారి ఈమెయిల్‌ ద్వారా నోటీసులు ఇవ్వాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఒకవైపు అనుమానితులకు నోటీసులు ఇస్తూ ఇంకోవైపు నిందితులను విచారిస్తున్న సిట్‌ అధికారులు ఇంకా ఈ కేసులో ఎవరికి సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికో లింక్‌ దొరికింది.

ఆంద్రప్రదేశ్‌కు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానించారు. దాంతో ఈ నెల 29వ తేదీన విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ప్రతిరోజూ రచ్చబండ పేరుతో సొంత పార్టీమీద సీఎం వైఎస్‌ జగన్‌ మీద వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు రఘురామ కృష్ణం రాజు. ఆయనకు కోర్టులు, కేసులు, విచారణలు కొత్త కాదు. ఇప్పటికే ఆయన వైసీపీ ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలతో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. మరి ఈ సిట్‌ విచారణకు హాజరువుతారా…? లేకపోతే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారా చూడాలి.