మరో శేషన్‌ని ఈ దేశంలో మళ్లీ చూడలేమా?
స్వతంత్ర వ్యవస్థే.. బట్ స్పాన్సర్డ్ బై సెంటర్!
స్వతంత్ర వ్యవస్థలు నిర్వీర్వమవుతున్నాయనే మాట తరచూ వినిపిస్తుంటుంది. దర్యాప్తు సంస్థలు ఎలాగూ పంజరంలో చిలకలైపోయాయి. ఏ గూటి పలుకులు ఆ గూట్లో పలుకుతున్నాయి. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియని పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించాల్సిన కీలక వ్యవస్థ కూడా మలినమైపోతోంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో వస్తున్న ఆరోపణలు, ప్రలోభాలు చూసినవారందరికీ శేషన్ గుర్తుకొస్తున్నారు. ఆయన సంస్కరణలు గుర్తుకొస్తున్నాయి. సాధారణ పౌరుడే కాదు అత్యున్నత న్యాయస్థానం కూడా ఇలాగే భావిస్తోంది.
శేషన్‌లాంటి కమిషనర్ ఇప్పుడెందుకు లేడని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకం తీరుని తప్పుపట్టింది. కేంద్ర ఎన్నికలసంఘం కమిషనర్‌గా అరుణ్గోయల్ని కేంద్రం జెట్ స్పీడ్‌తో నియమించింది. ఆయన నియామక ఫైల్‌కి ఒక్కరోజులోనే ప్రధాని ఆమోదముద్రపడింది. ఇదే విషయమై కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. కీలకమైన ప్రక్రియను ఒక్క రోజులోనే ఎలా పూర్తి చేశారని కేంద్రాన్ని నిలదీసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టు మే 15 నుంచి ఖాళీగా ఉంది. ఆర్నెల్ల తర్వాత ఒక్కరోజులోనే అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్‌ను నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే ఒక్క అరుణ్ గోయల్‌నే ఎలా నియమించారని ప్రశ్నించింది. మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారని నిలదీసింది. జూనియర్ స్థాయి వ్యక్తిని సీఈసీగా ఎలా ఎంపిక చేశారని వివరణకోరింది.
దర్యాప్తుసంస్థలను కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకుందని ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులకు ఐటీ, ఈడీ, సీబీఐలను అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారన్న అపవాదు ఉండనే ఉంది. చివరికి ఎన్నికలసంఘంలోనూ కేంద్రం జోక్యం పెరిగిందన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణ్ గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. నవంబర్ 17దాకా ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి అధికారిగా పనిచేశారు అరుణ్‌గోయల్. హఠాత్తుగా ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి మర్నాడే ఎన్నికల కమిషనర్‌గా నియమించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకే రోజు క్లియరెన్స్, అదే రోజు నోటిఫికేషన్, ఆ రోజే ఆమోదం ఎందుకీ మెరుపువేగం అన్న సుప్రీం ప్రశ్నకు కేంద్రం సమాధానం వెతుక్కుంటోంది.