బీజేపీ నేతలను తూర్పార పట్టేయ్యాలని నిర్ణయించుకున్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ముందే అటాక్ చేస్తున్నారు. బీజేపీ కంటే టీఆర్ఎస్ బెటర్ పార్టీ అని చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కవిత ఫైర్ బ్రాండ్
తండ్రికి మించిన తనయ అనిపించుకునే ప్రయత్నం
బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణాస్త్రాలు
కమలం పార్టీ చేస్తున్న ఆరోపణలతో కవితకు చిర్రెత్తుకొచ్చిందా ?
బ్లాక్ మనీతో సినిమాలు నిర్మిస్తున్నారని కవితపై ఆరోపణలు
రామనామం.. ఎమ్మెల్యేలను లాక్కోవడం అంటూ కవిత సెటైర్లు
తప్పుచేయని బీజేపీ నేతలకు భయమెందుకని ప్రశ్నలు
కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇప్పుడు దూకుడు పెంచారు. లిక్కర్ స్కాంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పుడు కాస్త వెనుకడుకు వేసిన కవిత. ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. లిక్కర్ స్కాంలో తన పేరు ప్రచురించకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు పొందినప్పుడు ఆమె బాగా వత్తిడిలో ఉన్నారనిపించింది. ఇప్పుడు మాత్రం ఆమె వీర వేగంతో రాజకీయాలు చేస్తున్నారనిపిస్తోంది. నిజామాబాద్ చౌరస్తాలో బీజేపీ ఎంపీ అరవింద్ ను చెప్పుతో కొడతానని ప్రకటించిన కవిత నాలుగు రోజుల్లోనే అంతకంటే ఎక్కువ టెంపోను కొనసాగించారు.
బీజేపీ అసలు ఒక పార్టీనే కాదన్నట్లుగా కవిత మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ఎప్పుడూ ఏడుస్తుంటారని, దొంగ ప్రమాణాలుచేస్తారని కవిత అంటున్నారు. తప్పు చేయకపోతే బీఎస్ సంతోష్ ఎందుకు విచారణకు రావడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మంత్రులు భయపడనప్పుడు బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారన్నది ఆమె ప్రశ్న.
కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పై కూడా కవిత తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తారు. వారికి సొంత నాయకులు ఉండరని వేరే పార్టీ నుంచి నాయకులను బలవంతంగా తీసుకెళ్తారని ఆమె అంటున్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు గేమ్ ప్లాన్ మార్చింది. మౌనంగా ఉంటే తప్పు చేసి భయపడుతున్నామని ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉందని గ్రహించింది. అందుకే అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అన్నట్లుగా దూకుడును కొనసాగిస్తోంది. పైగా ఫామ్ హౌస్ కేసు టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది.
కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ పదవితో ఆమె సంతృప్తి చెందడం లేదు. తాను ఓడిపోయిన నిజామాబాద్ లోక్ సభా నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేసి గెలవాలనుకుంటున్నారు. అందుకే నిజామాబాద్ లోనే అరవింద్ కు బొంద పెడతానని ఛాలెంజ్ విసురుతున్నారు. బీజేపీ భయపడుతోందని కమలం పార్టీ నేతలకు ప్రజల్లో బలం లేదని చెప్పడమే టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. లిక్కర్ స్కాం మాత్రమే కాకుండా ఏ స్కామలోనూ తన ప్రమేయం లేదన్న వాదనను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంగా కూడా కవిత గట్టిగా మాట్లాడుతున్నారనుకోవాలి. అప్పుడే ప్రజల్లో తన పట్ల నమ్మకం పెరిగి ఓటేస్తారని ఆమె విశ్వాసం. పైగా ఈసారి నిజామాబాద్ లోక్ సభా స్తానం నుంచి అరవింద్ పోటీ చేయకుండా చూడాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. అందుకే ఆయన విజయావకాశాలపై బీజేపీకే అనుమానం కలిగే విధంగా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కవిత అంత గట్టిగా మాట్లాడుతున్నారంటే టీఆర్ఎస్ ధైర్యం వెనుక ఏదో కారణం ఉందని బీజేపీ అనుమానించాలి. ఆ అనుమానపు బీజాలు ఇప్పటికే పడ్డాయనుకోండి.