బిస్లరీ: 4 లక్షలకు కొనుగోలు, 7 వేల కోట్లకు అమ్మకం

By KTV Telugu On 25 November, 2022
image

ప్యాకేజ్‌డ్‌ వాటర్‌కు మారుపేరు బిస్లరీ 
చేతులు మారుతున్న బిస్లరీ

బిస్లరీ అంటే డిస్టిల్డ్‌ వాటర్‌కు పర్యాయపదంగా మారిపోయింది.
అంతేకాదు స్వచ్ఛతనకు చిరునామాగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్ వ్యాపారంలో తిరుగులేని బ్రాండ్‌గా నిలదొక్కుకుంది బిస్లరి. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న బిస్లరీ ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. అసలు బిస్లరీ ఎలా మొదలైంది…? ఆ పేరు ఎలా వచ్చింది…? చూద్దాం..

ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. అలాగే ప్రస్తుతం వేల కోట్ల విలువ చేసే బిస్లరీ జర్నీ కూడా ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. నిజానికి బిస్లరీ అనేది ఒక ఇటాలియన్‌ కంపెనీ. దీన్ని 1965లో ఫెలిస్‌ బిస్లరీ తన పేరు మీదనే స్థాపించారు. 1969లో ఆ ఇటాలియన్ వ్యాపారవేత్త నుంచి రమేశ్‌ చౌహాన్‌ అనే యువకుడు కొనుగోలు చేశారు. అప్పటికి ఆయన వయసు 28 ఏళ్లు. ఉరకలెత్తే ఉత్సాహంతో చేతికొచ్చిన కంపెనీని పరుగులు పెట్టించారు చౌహన్‌. మొదట్లో గ్లాస్‌ బాటిల్స్‌లో బబ్లీ, స్టిల్‌ అనే రెండు వేరియంట్లతో ఇండియాలో లాంచ్ చేశారు. ఈ కంపెనీ పోర్టుఫోలియోలో గోల్డ్‌ స్పాట్ వంటి బ్రాండ్లు ఉండేవి. అప్పటికి నీళ్ల వ్యాపారం ఆలోచన లేదు. 70 దశకం ప్రారంభంలో ఫైవ్‌ స్టార్ హోటళ్ల నుంచి సోడాకు మంచి డిమాండ్‌ ఉండేది. దాంతో 1993లో తన తన కూల్‌ డ్రింక్స్‌ పోర్టుఫోలియోను 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించారు చౌహాన్‌. ఆ తరువాత ప్యాకేజ్‌డ్‌ వాటర్‌ మీద పూర్తిగా దృష్టి సారించారు.

ఏ ప్రొడక్ట్‌ అయినా ఎంత విలువైనదైనా వినియోగదారులను ఆకట్టుకోవాలంటే వారి నమ్మకాన్ని సంపాదించాలనేది చౌహాన్‌ వ్యాపార సూత్రం. ఆ పాలసీతో బిస్లరీకి ఒక బ్రాండ్‌ వాల్యూ తీసుకొచ్చారు. ప్రారంభంలో బిస్లరీ వాటర్ బాటిల్స్‌ను దూర ప్రాంతాలకు రవాణా చేయడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా సొంత రవాణ వ్యవ్థను ఏర్పాటు చేసుకున్నారు చౌహాన్‌. ఇప్పుడు బిస్లరీ సంస్థకు దాదాపు 5వేల ట్రక్కులు ఉన్నాయంటే చౌహన్‌ ముందు చూపు ఏంటో అర్థం చేసుకోవచ్చు. బిస్లరీని చూసి ఇతర కంపెనీలు కూడా ప్యాకేజ్‌డ్‌ వాటర్‌ బిజినెస్‌లోకి దిగాయి. 2000 సంవత్సరం ప్రారంభంలో టాటాకు చెందిన హిమాలయన్ బ్రాండ్‌తో మౌంట్ ఎవరెస్ట్‌ మినరల్ వాటర్‌తో బిస్లరికి గట్టి పోటీ ఇచ్చింది. ఇది కాకుండా అక్వాఫినా, కిన్లీ వంటి ఉత్పత్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయినా వాటన్నింటిని తట్టకుని తన టాప్‌ పొజిషన్‌ను నిలబెట్టుకుంది బిస్లరి.

కస్టమర్‌ డబ్బుకు తగిన విలువ కల ప్రొడక్ట్‌, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ తో దేశంలోని మూలమూలలకూ పాకిపోయాయి బిస్లరీ ప్యాకేజ్డ్‌ వాటర్‌ బాటిల్స్‌. ప్యాకేజ్‌డ్‌ వాటర్‌ వ్యాపారంలోకి అందరికంటే ముందుగా రావడం వల్ల తిరుగులేని బ్రాండ్‌గా నిలిచింది బిస్లరి. ఆ తరువాత ఎన్ని కంపెనీలు పోటీకి వచ్చినా ఈ కంపెనీ బ్రాండ్ వాల్యూను చెక్కుచెదరకుండా కాపాడారు చౌహాన్‌. ఇప్పుడు రమేశ్‌ చౌహాన్‌ వయసు 82 ఏళ్లు. వార్దక్యం వచ్చేసింది. శరీరం నీరసించిపోయింది. కొడుకులు లేరు. ఒక్కతే కుమార్తే. ఆమె పేరు జయంతి. కానీ తనకు తండ్రి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించాలనే ఆసక్తి లేదు. అందువల్ల ఒక్కో ఇటుక పేరుస్తూ నర్మించిన బిస్లరీ వ్యాపార సంస్థను విక్రయించాలనుకున్నారు చౌహాన్‌. ఈ విషయం తెలియగానే ఇండియాలోని అతిపెద్ద వ్యాపార సంస్థలు రమేశ్‌ చౌహాన్‌ ఇంటిముందు క్యూ కట్టారు. ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ సహా పలు ఇతర కంపెనీలు చౌహాన్‌తో చర్చలు జరిపాయి.

ఇటీవల టాటా సన్స్‌ చైర్మన్ ఎన్‌ చంద్రశేఖరన్, టాటా కన్స్యూమర్ సీఈఓ సునీల్ డిసౌజా కూడా చౌహాన్‌తో సమావేశం అయ్యారు. తాను ప్రాణం పెట్టి పెంచి పెద్ద చేసిన తన మానసపుత్రికను అంతే బాధ్యతగా చూసుకునే వారి చేతిలో పెట్టాలనేది చౌహాన్‌ ఆలోచన. అందుకే ఎన్ని కంపెనీలు ముందుకొచ్చినా టాటా గ్రూపు పట్ల ఆయన కాస్త మొగ్గు చూ పుతున్నట్లు తెలుస్తోంది. టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ తో ఏడు వేల కోట్లకు ఒప్పందం బేరం జరిగిందని ప్రచారం కూడా జరుగుతోంది. బిస్లరీకి దూరం కావడం మనసుకు బాధగా ఉన్నా టాటాలు అయితే దానిని జాగ్రత్తగా కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్. బిస్లరీ మీద టాటాలకు ఎంత నమ్మకం ఉందో టాటాల మీద కూడా చౌహాన్‌కు అంతే విశ్వాసం ఉంది. ఒక వ్యాపారవేత్తగా ఇక తాను సాధించాల్సింది ఏమీ లేదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరికొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించారు. సక్సెస్‌ ఫుల్ బినిజెస్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు. అందుకు ఇప్పుడు బిస్లరీని మరొకరి చేతుల్లో పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. తన సంస్థను అమ్మేశాక అందులో చిన్న వాటా కూడా ఉంచుకోవాలని అనుకోవట్లేదు చౌహాన్‌. ఇకముందు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తానని అంటున్నారు రమేశ్‌ చౌహాన్‌.