సాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్‌ రచ్చ

By KTV Telugu On 25 November, 2022
image

ఒపీనియన్ పోల్.. పాలిటిక్స్
టీడీపీ, వైసీపీల మధ్య డైలాగ్ వార్
వేడెక్కిన ఒపీనియన్ పోల్ రాజకీయం

ఏపీలో రాజకీయాలు చిత్రవిచిత్రంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం. ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. సాయిరెడ్డి సెల్ ఎక్కడకు పోలేదంటూ టీడీపీ ఏకంగా ఒపీనియిన్ పోల్ పెట్టడం. అందుకు కౌంటర్‌గా ఎంపీ మరో పోల్ స్టార్ట్ చేయడంతో యవ్వారం వేడెక్కుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రా రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతోనే సాయిరెడ్డి ఫోన్ పోయిందంటూ డ్రామా ఆడుతున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఫోన్ ఎక్కడ పోయిందో గమనించలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్న సాయిరెడ్డి కంప్లైంట్ మాత్రం తాడేపల్లి పీఎస్‌లో ఇచ్చారు. అంతే ఇక రాజకీయ రగడ మొదలైంది. దొరికిందే ఛాన్స్ అన్నట్టు నంబర్ 2ను టీడీపీ ఆటాడుకుంటోంది.

సాయి రెడ్డి సెల్ ఫోన్ ఎలా పోయింది? అంటూ ఒపీనియన్ పోల్ పెట్టింది టీడీపీ. దాంట్లో నాలుగు వెటకారపు ఆప్షన్లు పెట్టింది. ఎ)కృష్ణానదిలో విసిరేశారు. బి)రుషికొండ తవ్వకాల్లో పడేశారు. సి)తాడేపల్లి ప్యాలెస్ లాగేసుకొని దాచింది. డి) చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్‌లో ఉంది అంటూ ప్రశ్నలు సంధించింది. అంతేకాదు ఆ ఫోన్ మామూలు ఫోన్ కాదని చిత్రగుప్తుడు తయారు చేసిన పాపాల చిట్టా అని పేర్కొన్న టీడీపీ అది దొరికితే సీబీఐకి ఇవ్వాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. దీనిపై నెటిజన్ల కామెంట్లు కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. కొందరైతే పైవన్నీ అంటూ సమాధానమిస్తున్నారు. ఇక అదే రేంజ్‌లో విజయసాయిరెడ్డి టీమ్ చంద్రబాబు టార్గెట్ గా మరో పోల్ పెట్టింది. చంద్రం చిప్ ఎలా దొబ్బింది అని ప్రశ్నిస్తూ ఒపీనియన్ పోల్ పెట్టింది. దాంట్లో ఎ)మాధవరెడ్డి ఫామ్‌హౌజ్‌లో ఉంది. బి)బోకేష్ దొబ్బేశాడు. సి)టీడీపీ చిల్లర దొంగలు దాచేశారు. డి)అమరావతి రియల్ ఎస్టేట్ భూముల్లో పాతేశాడు అంటూ పోల్ పెట్టింది.

విశాఖలో విజయసాయిరెడ్డి విచ్చలవిడిగా భూఅక్రమాలకు పాల్పడుతున్నాడని టీడీపీ ఆరోపిస్తోంది. దసపల్లా భూములు, రుషికొండ భూముల విషయంలో ఎంపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇక అదేసమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సాయిరెడ్డి అల్లుడి అరెస్ట్‌తో రాజకీయం మరింత వేడెక్కింది. ఇదిలా ఉండగానే ఇటీవల శంషాబాద్‌లోని ఫాంహౌజ్‌లో సాయిరెడ్డి ఫోటోలు బయటకొచ్చిన వ్యవహారం హీటెక్కించింది. ఇక తాజాగా సాయిరెడ్డి సెల్ ఫోన్ పోయిందంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమైంది. ఫోన్ మిస్సింగ్ ఘటనపై రెండు పార్టీల మధ్య సంచలన వ్యాఖ్యల పర్వం నడుస్తోంది.