సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎలా ?
కేంద్రం అష్టదిగ్బంధం చేసిందన్న కేసీఆర్
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు కేంద్రంతో కేసీఆర్ సర్కారు కయ్యం పెట్టుకోవడంతో దాని ప్రభావం రాష్ట్ర ఖాజానాపై పడింది. ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు దాని సెగ తగులుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే రాష్ట్ర ఖజానా ఖాళీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు రూ. 40 వేల కోట్లు లోటు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కారణం కేంద్రమే అని అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని మండిపడుతున్నారు సీఎం కేసీఆర్. కేంద్రం తీరుతోనే రాష్ట్రానికి రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలకు గండి పడిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి 53,970 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్లో అంచనాలు వేసుకుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో 15వేల కోట్లకు కోత విధించింది. బడ్జటేతర రుణాల పేరుతో మరో 20 వేల కోట్లకు కత్తెర వేసింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడంతో 6 వేల కోట్లు నష్టపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2022 – 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ. 40 వేల కోట్లు గండి పడిందని ప్రభుత్వమే స్పష్టం చేయడంతో ఆ లోటును ఎలా పూడుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏ స్కీమ్‌కు కోత పెడతారో అని చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరించడానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఇందుకోసం డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోత పెట్టడం వల్ల కొన్ని స్కీమ్స్‌కు నిధుల కొరత తప్పదని ఆ సమావేశాల్లో కేసీఆర్ స్పష్టం చేస్తారని అనుకుంటున్నారు.