డేటా రక్షణకా? వ్యక్తిగత స్వేచ్ఛ హరించేందుకా?
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడాలంటే దానిమీద డేగకన్ను వేయమని కాదు. కానీ కేంద్రం ప్రతిపాదించిన బిల్లు కొత్త అనుమానాలు కలిగిస్తోంది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లు-2022పై ప్రజాస్వామ్యవాదులు, మేథావులు ఆందోళన చెందుతున్నారు. డేటా పరిరక్షణ పేఉతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాడుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లు-2022పై అప్పుడే అనుమానాలు ముసురుకుంటున్నాయి. 2021 బిల్లులో 90 సెక్షన్లుంటే వాటిని 2022 బిల్లులో 22కు కుదించారు. తాజాగా ప్రజల ముందు పెట్టిన ముసాయిదా బిల్లులో 18 చోట్ల ‘అవసరమైతే నిర్దేశించవచ్చు’ అన్న పదాన్ని వాడారు. అంటే ఈ బిల్లు చట్టరూపం దాల్చాక కేంద్రం తనకు అనువుగా, తన అవసరాలకు తగ్గట్లు మార్చుకునే వెసులుబాటు ఉన్నట్లే! పౌరుల డేటా రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి కేంద్రం నాలుగు ముసాయిదాలు తయారు చేసింది. మార్పులు చేర్పులు చేసుకుంటూ డీపీడీపీ-2022 ముసాయిదాని ప్రజల ముందు ఉంచింది.
డీపీడీపీ-2022బిల్లుపై ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ అభ్యంతరాలు లేవనెత్తింది. ఇందులో క్లాజ్ 35 ప్రకారం సార్వభౌమత్వం, దేశ సమగ్రత, దేశ రక్షణ, విదేశీ సంబంధాలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణవంటి కారణాలతో ప్రభుత్వ యంత్రాంగాలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే వీటిలో ఏ కారణాన్ని చూపించైనా పౌరుల వ్యక్తిగత సమాచారం కోరవచ్చు. అడగాల్సిన పనికూడా లేదు. కేంద్రమే ఏకపక్షంగా డేటా తీసుకోవచ్చు. డాటా దుర్వినియోగానికి పాల్పడే సంస్థలకు రూ.500 కోట్లదాకా జరిమానా విధించాలని ప్రతిపాదించారు. కానీ ఆ చౌర్యంతో నష్టపోయే పౌరులకు పరిహారం ప్రస్తావన మాత్రం లేదు. ప్రభుత్వ సంస్థలు చట్టం పరిధిలోకి రాకపోతే డేటా సేకరణ, విశ్లేషణలో నియంత్రణ ఉండదు. ఇది పౌరుల భద్రతకు ప్రమాదకరమే కాదు అధికారంలో ఉన్నవారు ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించిన పౌరుల సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పొరపాటున ఫోన్కొచ్చే ఏ లింక్నో తెరిచినా కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్లవుతోంది. ఇప్పుడు భద్రత పౌరుతో తెస్తున్న ‘షరతులు వర్తిస్తాయి’ తరహా బిల్లు సామాన్యులకు సమస్యలు తెచ్చిపెట్టడం తప్ప రక్షణ ఇస్తుందన్న నమ్మకమైతే లేదు.