వివాదంలో చిక్కుకున్న టీమిండియా ఆల్‌రౌండర్

By KTV Telugu On 26 November, 2022
image

బంగ్లా టూర్‌కు డుమ్మా..భార్య కోసం ప్రచారం
గాయం పేరు చెప్పి బంగ్లా టూర్‌కు దూరం
భార్య రివాబా తరపున ఎన్నికల ప్రచారం
ఫ్లెక్సీలో జడేజా జెర్సీ ఫోటోపై తీవ్ర దుమారం

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వివాదంలో చిక్కుకున్నారు. గాయం పేరుతో బంగ్లా టూర్‌కు డుమ్మా కొట్టి భార్య కోసం ఎన్నికల ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ప్రచారంలో భాగంగా జడేజా ఇండియన్‌ జెర్సీతో ఉన్న ఫోటోలతో బీజేపీ కరపత్రాలు పంచడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తన భార్య రివాబా గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు జడేజా. ఈ ఎన్నికల్లో జడ్డూ భార్య రివాబా నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా ఫ్లెక్సీల్లో టీమిండియా జెర్సీతో ఉన్న జడేజా ఫొటోలు వాడడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ఎన్నికల్లో గెలవడం కోసం దేశ గౌరవాన్ని మంటగల్పుతోందని ఆరోపిస్తున్నాయి. రివాబాపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ క్రికెటర్‌గా ఇలాంటి రాజకీయాలు తగునా జడేజా అంటూ అభిమానులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.

గాయం కారణంతో వరల్డ్ కప్‌కు దూరమైన జడేజా న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. అయితే ఆ తర్వాతి బంగ్లా టూర్‌లోనైనా ఆడతాడనుకుంటే గాయం పేరుతో ఆఖరి నిమిషంలో ఝలక్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే తన భార్య రివాబా ఎన్నికల ప్రచారంలో తేలాడు. జడేజా నీకు ఇది తగునా. భార్యను గెలిపించుకోవడం కోసం బంగ్లా టూర్‌కు డుమ్మా కొడతావా. గాయంతో బాధపడుతున్నానని చెప్పి రాజకీయం చేస్తావా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అదేసమయంలో బీజేపీ తీరును తప్పుబడుతున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఇదేం రాజకీయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం ఆడేందుకు ఎందరో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జడేజా వ్యవహరించిన తీరును ప్రతీ ఒక్కరూ తప్పుబడుతున్నారు.

డిసెంబర్‌ 1,5 తేదీల్లో రెండు విడుతల్లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్‌ తేదీ దగ్గర పడడంతో భార్యకు అండగా జడేజా ప్రచారంలో పాల్గొన్నాడు. 6 ర్యాలీల్లో పాల్గొని బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యాంపెయిన్‌లో పాల్గొనడం తప్పు కాదు కానీ తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ గాయం పేరు చెప్పి బంగ్లా టూర్‌కు దూరమవ్వడం వివాదానికి దారి తీసింది. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమి తర్వాత అనేకమంది జడేజా లాంటి ఆల్‌రౌండర్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. అతను గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఎందరో కోరుకున్నారు. కానీ దేశంకోసం ఆడాల్సిన అవకాశం వచ్చినప్పుడు  ఇలా దొంగసాకులు చెప్పి టూర్‌కు డుమ్మా కొట్టడం ఎంతవరకు కరెక్టని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టీమిండియా  బంగ్లాదేశ్‌ పర్యటన డిసెంబర్‌ 4న మొదలవుతుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా అదే రోజు తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత్‌ 7, 10 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్‌ 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది.