సజ్జల వర్సెస్ విజయసాయి … వైసీపీలో పవర్ గేమ్ !

By KTV Telugu On 2 May, 2022
image

వైసీపీలో పవర్ గేమ్ నడుస్తోంది. జగన్ తర్వాత రెండు పవర్ సెంటర్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిల మధ్య ఈ పవర్ గేమ్ నడుస్తోంది. నిన్నామొన్నటిదాకా సజ్జలదే పైచేయి కాగా.. హఠాత్తుగా విజయసాయిరెడ్డి ముందుకు వచ్చారు. పార్టీపై పట్టు సాధించారు. వీరి మధ్య జరుగుతున్న పవర్ గేమ్‌లో పార్టీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. చాలా మంది సజ్జలతో టచ్‌లో ఉంటూండగా కొంత మంది విజయసాయిరెడ్డి ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో వైసీపీలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్ !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవుల పంపకంలో మొదట పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని భావించిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వారం రోజుల్లోనే కీలకమైన బాధ్యతలు పొందారు. కేవలం పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జ్‌ పదవి మాత్రమే ఆయనకు గతంలో దక్కింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డినే ఉండేవారు. పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడిచేవి. ప్రశాంత్ కిషోర్ టీంతో సమన్వయం చేసుకుంటూ… పార్టీలో చేరికల్ని.. పార్టీ యంత్రాగానికి ఎన్నికలకు ఎదర్కొనేందుకు పూర్తి స్థాయి సహకారాన్ని ఆయన అందించారు. ఎన్నికలు అయిపోయి వైఎస్ఆర్‌సీపీ విజయం తర్వాత ఆయన ఉత్తరాంధ్రకు పరిమితయ్యారు. పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే సోషల్ మీడియా పోస్టింగ్‌ల వల్ల అనేక సమస్యలు పార్టీకి వచ్చాయి అదే సమయంలో ఉత్తరాంధ్రలో పరిస్థితులు కూడా కలసి రాకపోవడంతో విజయసాయిరెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. మెల్లగా ఆయనను దూరం పెడుతున్నారని వైఎస్ఆర్‌సీపీలోనే చెప్పుకున్నారు. అలాగే జరిగింది. కానీ వారంలోనే మార్పు వచ్చేసింది.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా తానై వ్యవహరిస్తున్న సజ్జల !

గత వారం ప్రకటించిన సంస్థాగత పదవుల విషయంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలోనూ కీలక పదవులు పొందారు. జిల్లాల అధ్యక్షులు.. కోఆర్డినేటర్లందరూ ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సీఎం జగన్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి బాగా దగ్గరయ్యారు. ఆయనకు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయి పట్టు చిక్కిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలోనూ ఆయన చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అంశంలోనూ ఆయన కీలకంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ పదవుల పంపకం జరిగింది. ఈ పదవులను అత్యంత కీలకంగా భావించారు. రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధం కావడానికి ఈపదవులు కీలకం. ఈ పదవుల్లోనూ సజ్జలదే పైచేయి అయింది. అటు ప్రభుత్వం.. ఇటు పార్టీలో సజ్జల కు ఇక ఎదురు లేదనుకున్నారు.

జగన్‌కు చెప్పాల్సింది చెప్పి ప్రాధాన్యత దక్కించుకున్న విజయసాయి !

అనూహ్యంగా వారంరోజుల్లోనే పరిస్థఇతిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు విజయసాయిరెడ్డి. జగన్‌తో నేరుగా చర్చించారు. తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోవడం వల్ల వచ్చేసమస్యలను వివరించారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల.. పార్టీ వ్యవహారాలపైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని వివరించి… ఆ బాధ్యతలు తనకు దక్కేలా చూసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గలేదని.. పట్టు బట్టి సాధించుకున్నారని వైఎస్ఆర్‌సీపీలోని ఆయన మద్దతు దారులు సంతృప్తిగా ఉన్నారు.

సజ్జల వర్సెస్ విజయసాయి
కోల్డ్ వార్‌తో పార్టీకి లాభమా? నష్టమా ?

బయటకు కనిపించదు కానీ సజ్జల, విజయసాయి మధ్య కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీలో ఇప్పుడు రెండు వర్గాలున్నాయి. ఒకటి సజ్జల.. మరొకటి విజయసాయి. పార్టీపై ఇప్పుడు విజయసాయి పెత్తనం దక్కించుకున్నారు. కానీ పార్టీ పదవులు పొందిన వారంతా సజ్జల అశీస్సులు ఉన్నవాళ్లు. ఇప్పుడు వారంతా సజ్జల చెప్పినట్లుగా చేయడానికే ఇష్టపడతారు కానీ విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా కాదు. ఈ కోల్డ్ వార్ సమస్యలేమిటో ముందు ముందు తెలుస్తుంది. పవర్ గేమ్ వల్ల మొత్తానికే తేడా వస్తుందేమో అని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.