కేసీఆర్‌ ఖతర్నాక్‌.. బీజేపీకి ఆ అవకాశం ఇవ్వరు!

By KTV Telugu On 27 November, 2022
image

కేసీఆర్‌ కాదుకాదంటున్నా ముందస్తుకే ఛాన్స్‌!

దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితమే రిపీటై ఉంటే కారు మొరాయించేది. కేసీఆర్‌ పార్టీ డీలాపడేది. కానీ మునుగోడులో బీజేపీ ఎత్తుల్ని చిత్తుచేసి గెలవటంతో కేసీఆర్‌ లెక్కమారిపోయింది. పార్టీ మీటింగ్‌ పెట్టి ముందస్తు ఆలోచన లేదని చెప్పినా షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలంటున్నా ముందస్తుగానే గంట మోగేలా ఉంది. ఫాంహౌస్‌ కేసు దెబ్బతో ఇప్పట్లో టీఆర్‌ఎస్‌నుంచి కీలక నేతల నిష్క్రమణ కష్టమే. బీజేపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా గులాబీపార్టీనుంచి ముఖ్యనేతల్ని లాక్కోవడం అంతఈజీ కాదు. అందుకే కాంగ్రెస్‌పై గురిపెట్టింది కమలంపార్టీ. మర్రి శశిధర్‌రెడ్డిలాంటి సీనియర్‌మోస్ట్‌ లీడర్‌ని కూడా తన గూట్లో చేర్చుకుంది.

ముందస్తు ఎన్నికలు లేవంటున్నా మునుగోడు బైపోల్‌ తర్వాత కేసీఆర్‌ మూడ్‌ మారింది. ఇప్పుడాయన నిర్ణయాలు చూస్తుంటే ఏ క్షణమైనా ఆ ప్రకటన వచ్చేలా ఉంది. డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలతో కేంద్రం తీరుని సభలోనే ఎండగట్టాలనుకుంటున్నారు గులాబీబాస్‌. మరోవైపు బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు టూర్‌ ప్లాన్లు రెడీ చేస్తున్నారు. కేసీఆర్‌ సంకేతాలకు తోడు రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు వస్తాయంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఫాంహౌస్‌ కేసు తర్వాత టీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా కేంద్ర నిఘాసంస్థల దాడులు పెరిగాయి. గుజరాత్‌ ఎన్నికల తర్వాత ఈ దాడి ఎక్కువయ్యేలా ఉంది. అందుకే ముందస్తే అన్ని సవాళ్లకూ మందు అనుకుంటున్నారు కేసీఆర్‌.

మునుగోడు బైపోల్‌ ముగిసినా ప్రచార వేడి తగ్గకుండా ప్రజల్లోనే ఉండేలా కేసీఆర్‌ సభలు నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు బహిరంగ సభలకు ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబరు 4న మహబూబ్‌నగర్, 7న జగిత్యాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్, కరీంనగర్‌లలో డిసెంబరు చివరి వారంలో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. తరువాత అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించాలనే ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నారు. 2023 డిసెంబరుదాకా తెలంగాణఅసెంబ్లీకి గడువుంది. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే 2023 జూన్‌లోపు మళ్లీ ఎన్నికలు జరపాల్సి వుంటుంది. అందుకే గతంలోలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లి హ్యాట్రిక్‌ కొట్టాలనే వ్యూహంతో ఉంది టీఆర్‌ఎస్‌ నాయకత్వం. తెలంగాణ ప్రజలనాడి తనకు బాగా తెలుసన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఆ నాడిని ఎప్పుడో పట్టుకున్న కేసీఆర్‌ బీజేపీ బలపడేలోపే ప్రజాక్షేత్రంలో దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నారు.