CBI ప్రొడక్షన్స్.. పులివెందుల సిరీస్.. ఎన్ని ఎపిసోడ్స్
మూడున్నరేళ్లయింది మర్డర్ జరిగి. ఆయనేమన్నా అనామకుడా అంటే అదీ కాదు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రికి తోడబుట్టిన సోదరుడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్. కేసు దర్యాప్తు చేస్తోందేమో ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. ఈపాటికి ఎంక్వయిరీ పూర్తయిపోయుండాలి. నిందితులెవరో తేలిపోయి ఉండాలి. కేసు ట్రయల్‌కొచ్చి శిక్షలదాకా వచ్చుండాలి. కానీ కేసుకి ఎండ్‌కార్డ్ పడటం లేదు. నిద్రలో గుర్తుకొచ్చినట్లు సడెన్‌గా సీబీఐ టీం రంగంలోకి దిగుతుంది. నాలుగురోజులు హడావుడి చేస్తుంది తర్వాత చడీచప్పుడు ఉండదు. ఈలోపు సీబీఐ సిరీస్‌లో కొత్తకొత్త ట్విస్టులు చోటుచేసుకుంటుంటాయి. కొత్త పాత్రలు తెరపైకొస్తుంటాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంతోమందిని విచారించి చివరికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ ప్రధాన నిందితుడిగా తేల్చింది. ఇప్పుడు తాజాగా దేవిరెడ్డి భార్య తులసమ్మ తెరపైకొచ్చారు. పులివెందుల మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసులో మరో ఆరుగురిని విచారించాలని ఫిబ్రవరి 21న తులసమ్మ పిటిషన్ వేశారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను విచారించాలని తులసమ్మ వేసిన పిటిషన్‌పై 9 నెలల తర్వాత కోర్టు ఇవాళ వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది.
దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా తేల్చిన సీబీఐ తనవాదనకు కొన్ని ఆధారాలు చూపింది. మర్డర్ స్పాట్‌లో ఆధారాలను ధ్వంసం చేశారని, వివేకా గుండెపోటుతో మరణించారని ఆయనే తొలుత ప్రచారం చేశారని అభియోగాలు మోపింది. మరోవైపు ఈమధ్యే హత్యకేసులో నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకోసం సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి తన భద్రతపై ఆందోళనపడుతున్నాడు. గన్‌మెన్లను మారుస్తున్నారంటూ ఆరోపిస్తున్నాడు. కేసు దర్యాప్తును కొందరు ప్రభావితం చేస్తున్నారని వివేకా కూతురు సునీతారెడ్డి అనుమానిస్తున్నారు. ఆమె పిటిషన్‌పై సుప్రీం సానుకూలంగా స్పందించింది. వివేకా హత్యకేసును మరో రాష్ట్రంలో విచారించేందుకు అంగీకరించింది.
సీబీఐ అధికారులమీదే కొందరు నిందితులు రివర్స్ కేసు పెట్టారు. ఒకరికిద్దరు సాక్ష్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరికొందరు ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇన్ని ట్విస్టులున్న కేసుని సీబీఐ సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. దేశంలో కొత్తకొత్త కేసుల్ని హ్యాండిల్ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తుని నానుస్తోంది. సోషల్‌మీడియాలో పోస్టులకే రాత్రికిరాత్రి అరెస్టులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ కేసు తమ పరిధిలోది కాదని వదిలేసింది. కేసు చిక్కుముడి వీడలేదుగానీ వైఎస్ వివేకా మర్డర్ ఇప్పటికీ పొలిటికల్ ఇష్యూగానే ఉంది.