రాహుల్ గాంధీ తెలంగాణలో రాజకీయ పర్యటనకు సుదీర్గ విరామం తర్వాత వస్తున్నారు. వచ్చే ఎన్నికలకు స్ట్రాటజీ రెడీ చేసుకుని అమలు చేయడానికే రాహుల్ తొలి అడుగు వేస్తున్నారు. రాహుల్ పాల్గొనే సభకు రైతు సంఘర్షణ సభ అని పేరు పెట్టడంతోనే కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ వచ్చే ఎన్నికల్లో ఏ స్ట్రాటజీతో రంగంలోకి దిగబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో రైతు ఎజెండాతో కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగనుంది. దానికి రాహుల్ ప్రారంభం చేయబోతున్నారు. రైతు సంఘర్షణ సభలో రాహుల్.. రైతులకు భరోసా ఇచ్చేలా కీలకమైన ప్రకటనలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
“వ్యవసాయ మేనిఫెస్టో”ను ప్రకటించనున్న రాహుల్ !
వరంగల్ సభలో రాహుల్ గాంధీ ” వ్యవసాయ మేనిఫెస్టో” ప్రకటించే అవకాశం ఉంది. రైతు అంశాలే ఎజెండాగా తీసుకుని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాలను వెల్లడించనున్నారు. రాహుల్ గాంధీతోనే రైతులకు మద్దతు ధర, పంట పెట్టుబడి సాయం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతు ధర కల్పించడం, ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఏ పంటలు వేసినా వాటికి అనుకూలంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో పండించే పంటల ఆధారంగా కొనుగోళ్ల ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను వెల్లడించనున్నారు. అసైన్డ్ భూములు, పోడు భూముల సమస్యలను కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచిందని, కానీ, టీఆర్ఎస్ వాటిని గుంజుకుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద రైతులకు ఏం చేస్తారో వివరించనున్నారు. కౌలు రైతులపై కూడా కీలకమైన అంశాలను ప్రస్తావించనున్నారు. కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి అంశాలపై ప్రకటన చేయనున్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల ఆదరణ సాధించే ప్రయత్నం !
తెలంగాణ వచ్చిన క్రెడిట్ టీఆర్ఎస్‌కు దక్కింది. కానీ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మాత్రం కాంగ్రెస్‌కు ఇప్పటి వరకూ లభించలేదు. సోనియా ఇవ్వకుండా తెలంగాణ ఎలా వస్తుందన్నది కాంగ్రెస్ నేతల పాయింట్. యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చింది కనుక గొప్పతనం అంతా కాంగ్రెస్‌కే దక్కాలన్నది ఆ పార్టీ నేతల వాదన. కేసీఆర్ కూడా అనేక సార్లు తెలంగాణ ఇచ్చింది సోనియానేనని ప్రకటించారు. అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు.. ప్రత్యేకరాష్ట్ర సాధన విషయంలో… కాంగ్రెస్ పార్టీకి కానీ.. సోనియాకు కానీ ఇసుమంత క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టం పడటం లేదు. దీనికి కారణం… ఎన్నికలు దగ్గర పడటమే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. తాము ఓడిపోవడం ఏమిటన్న విస్మయం.. కాంగ్రెస్ నేతల్లో ఇప్పటికీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కలను సాకారం చేసినా.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లుగా మలుచుకోవడంలో నేతలు విఫలమయ్యారని.. హైకమాండ్ తేల్చింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా… ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనే… విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
దళిత, మైనార్టీలు కాంగ్రెస్ వైపే ఉంటారని అంచనాలు !
కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళిత, మైనార్టీలు అండగా ఉన్నారు. తర్వాత పరిస్థితులు మారాయి. దళితులు ఇప్పటికీ అండగా ఉన్నా.. కేసీఆర్ దళిత బంధు వ్యూహం అమలు చేస్తున్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక మైనార్టీలు వైఎస్ మరణం తర్వాత ఎంఐఎం ప్రోద్భలంతో టీఆర్ఎస్ వైపు మళ్లారు. కానీ ఇప్పుడు ఎంఐఎం పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. దళిత బంధు మోసమని గుర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు.. తమ పాత ఓటు బ్యాంక్ తమకు కలసి వస్తుందని.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఏ మాత్రం సానుకూలంగా ఉన్నా.. ఏకపక్ష ఫలితాలు వస్తాయని నమ్ముతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాంటి చాన్సులు వదులుకోకూడదని అనుకుంటోంది. పార్టీకి అంతర్గత సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కోగలమని ధీమాతో ఉన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకత్వం ఉండటం.. ఆయన నాయకత్వంపై కార్యకర్తలకు ధీమా ఉండటంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో కాస్త జోష్ కనిపిస్తోంది. దాన్ని నిలబెట్టుకునేందుకు రాహుల్ టూర్ ఓ అవకాశంగా మారనుంది.