బీఆర్ఎస్ గెలిస్తే ఐటీ దాడులు ఉండవన్న మంత్రి
బీఆర్ఎస్ దేశమంతా పోటీ చేస్తుందని ప్రకటన
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎంత సీరియస్గా మాట్లాడినా వినేవారికి నవ్వొస్తుంది. శాసనసభలో ఆయన మాట్లాడుతుంటే అధికార పక్ష సభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఆయన మాట తీరు అలా ఉంటుంది మరి. ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు జరిగాయి. ఐటీ అధికారులు తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని మల్లారెడ్డి చెబుతున్నప్పుడు కూడా మీడియా ప్రతినిథులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇలా అందరినీ నవ్వించే మల్లారెడ్డి అప్పుడప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడి అందరిలోనూ నవ్వుల పాలవుతుంటారు. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు విన్న ప్రజలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదు. ఆయన ఏమన్నారంటే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీదాడులు ఉండవని అనౌన్స్ చేసేశారు. దేశంలో ఎవరు ఎంత సంపాదించుకున్నా సరే స్వచ్ఛందంగా వారికి నచ్చినంత పన్ను చెల్లిస్తే సరిపోతుందని సెలవిచ్చారు.
అంటే కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యాక ఆదాయపు పన్ను పై ఇప్పుడు ఉన్న నిబంధనలు ఎత్తేస్తారన్నమాట. మరి పన్నులు వసూలు చేయకుంటే ప్రభుత్వాని ఆదాయం ఎలా సమకూరుతుంది. ఆదాయం లేకుంటే ప్రభుత్వం ఎలా నడుస్తుంది? అభివృద్ధి పనులు ఎలా చేపడతారు? అని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు ప్రజలు. కేవలం ఐటీయేనా లేక జీఎస్టీ కూడా రద్దు చేస్తారా అని సెటైర్లు వేస్తున్నారు. మల్లారెడ్డి అక్కడితో ఆగలేదు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీచేస్తుందని ప్రకటించేశారు. అసలు ఇప్పటిదాకా బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం గుర్తింపే రాలేదు. ఆ పార్టీ ప్రణాళిక ఏమిటో విధివిధానాలు ఏంటో వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీచేస్తుందో ఇంకా కేసీఆరే ప్రకటించలేదు.
ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర , తమిళనాడులో కొన్ని చోట్ల పోటీచేసే అవకాశం ఉందని చూచాయగా చెప్పడమే తప్ప ఆ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలియకుండానే మల్లారెడ్డి ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లో బరిలోకి దిగుతుందని కన్ఫమ్ చేసేశారు. అంతేకాదు ఐటీ అధికారులు తన మీద 15 కేసులుపెట్టారని వాటికి భయపడనని తన వెనుక కేసీఆర్ ఉన్నంతవరకు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని పదే పదే చెబుతున్నారు. మల్లారెడ్డి మాటలు బిజెపి నాయకులకు అస్త్రంలాగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. మంత్రి మాటలను కోట్ చేస్తూ అవినీతి పరులను కేసీఆర్ కాపాడుతున్నారు అని బిజెపి నాయకులు విరమర్శించేందుకు ఆస్కారం ఇచ్చినట్లయింది. అత్యుత్సాహంతో మల్లారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.